దిశ, తెలంగాణ బ్యూరో: ప్రగతిభవన్‌లో గంటల తరబడి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ జరిగిన తీరుపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నెల 20, 21వ తేదీలలో ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలు, ఇచ్చిన సమాధానాన్ని కవిత తండ్రి సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్నారు. ఎన్ని ప్రశ్నలు అడిగారు.. ఎన్నింటికి సమాధానం చెప్పారు.. సమాధానం తర్వాత వాళ్లు ఎన్ని గంటలు వెయిటింగ్ చేయించారు.. ఇంకా ఏమైనా వివరాలు అడిగారా అని సీఎం కేసీఆర్ తెలుసుకుంటున్నారు. ఈడీ అధికారులు వ్యవహరించిన తీరును సైతం కవిత వివరించినట్లు తెలిసింది.
ఈనెల 24వ తేదీన సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణలో ఉండడంతో.. ఆ తీర్పు ఏమని వస్తుంది.. ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై సైతం చర్చిస్తున్నట్లు సమాచారం. రెండు రోజులు ఢిల్లీలో న్యాయ బృందంతో చర్చించిన అంశాలను.. విచారణకు ముందు సైతం తీసుకున్న సలహాలు.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తీరుపై సైతం కేటీఆర్ తండ్రికి వివరించినట్లు సమాచారం. సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత తీసుకోవాల్సిన అంశాలను సైతం చర్చిస్తున్నట్లు తెలిసింది.
ఈడీ అధికారుల తదుపరి నోటీసులు ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది.. మొబైల్ ఫోన్లు అధికారులకు అందజేసినప్పుడు ఈడీ అధికారుల రియాక్షన్ ఎలా ఉందనే దానిపై కవిత కేసిఆర్‌కు వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. విచారణకు సంబంధించి మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని.. ఆచితూచి వ్యవహరించాలని.. లోపల జరిగిన విషయాలు సైతం మీడియాకు వెల్లడించవద్దని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించవద్దని సూచించినట్లు తెలిసింది.