MLC Kavitha: మరి నెక్ట్స్ ఏంటి..! కవిత ఫ్యూచర్ ప్లాన్‌పై విస్తృత చర్చ

ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్‌పై పార్టీలో చర్చ మొదలైంది.

Update: 2024-08-28 02:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్‌పై పార్టీలో చర్చ మొదలైంది. రాజకీయ నేతల కామెంట్లు, దర్యాప్తు సంస్థలు వెల్లడించిన అంశాలపై ఆమె ఎలా రియాక్ట్ అవుతారనే ఆసక్తి నెలకొన్నది. మరోవైపు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటారా? పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో చొరవ తీసుకుంటారా? నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మళ్లీ యాక్టివిటీస్ మొదలుపెడతారా? భారత్ జాగృతిని మరింత విస్తృతం చేస్తారా? ఇలాంటి అనేక రకాల చర్చలు బీఆర్ఎస్ నేతల మధ్య చోటుచేసుకుంటున్నాయి.

పార్టీ పట్ల గతంలో అసహనం

పొలిటికల్ ప్రయోజనాల కోసమే బీజేపీ తనను అరెస్టు చేయించిందని, ఇలాంటి బెదిరింపులకు లొంగేది లేదని, కడిగిన ముత్యంలా బైటకు వస్తానని, డాటర్ ఆఫ్ ది ఫైటర్‌గా భయపడే ప్రసక్తే లేదని... అరెస్టుకు ముందు కవిత అనేక రకాల స్టేట్‌మెంట్లు ఇచ్చారు. రాజకీయ ప్రేరేపితమైన అరెస్టంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రెండేండ్ల క్రితం ఆమె పేరు బయటకు రాగానే వ్యక్తిగతంగా ఆమెపై రకరకాల కామెంట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రస్తావించినా, ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా పార్టీకి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో నాయకత్వం దూరంగానే ఉంచింది. పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామిని చేయకపోవడంపై ఆమె ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడను ఎండగట్టడంలో, తనకు అండగా నిలవడంలో పార్టీ నాయకత్వం విఫలమైందన్న అసంతృప్తినీ వెళ్లగక్కారు.

పార్టీలో రోల్‌పై ఆసక్తి

బెయిల్‌పై బయటకు వచ్చిన కవిత ఇకపై పార్టీలో ఎలాంటి రోల్ పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ ఇంతకాలం తనను దూరం చేసినందున ఇప్పుడు తనంతట తానుగా ఇన్‌వాల్వ్ అవుతారా?.. లేక పార్టీ ఆహ్వానిస్తే పాలుపంచుకుంటారా? అధికారంలో లేని సమయంలో పార్టీలో ఆమె పాత్ర ఎలా ఉండబోతున్నది? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. రానున్న రోజుల్లో ఆమె తీసుకునే నిర్ణయం కీలకంగా మారనున్నది. అరెస్టుకు ముందు బీజేపీపై నిప్పులు చెరిగిన కవిత ఇప్పుడు ఆ పార్టీ పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటారనేది ఆసక్తికరం. ఒకవైపు బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్‌గా మారిందనే ఆరోపణల నేపథ్యంలో కవిత ఫ్యూచర్ ప్లాన్ చర్చకు దారితీసింది.

పొలిటికల్ స్ట్రాటజీపై ఆసక్తి

పార్లమెంటు ఎన్నికల షెడ్యూలు విడుదల కావడానికి ఒక రోజు ముందు ఆమెను ఈడీ అధికారులు అరెస్టు చేయడంతో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనే అవకాశం లేకుండాపోయింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా బతుకమ్మ ఉత్సవాలకు దూరంగా ఉన్న కవిత ఈసారి జాగృతి తరఫున పాల్గొంటారా? లేదా? అనే చర్చ మొదలైంది. బీజేపీ ఎత్తుగడలకు లొంగలేదని, ఇక ఆ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదనే స్టాండ్ తీసుకుంటారా అనే గుసగుసలు మొదలయ్యాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కారణంగా పార్టీ ఇంతకాలం ఆమెను దగ్గరకు రానివ్వని కారణంగా ఇప్పుడు ఆమె తనకంటూ సొంత బేస్‌ను ఏర్పాటు చేసుకునేలా సమాంతరంగా ఎలాంటి పొలిటికల్ స్ట్రాటజీని రూపొందించుకుంటారనే మాటలూ ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.

విమర్శలను తిప్పికొట్టేలా..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మచ్చ కారణంగా ప్రజల్లో ప్రతిష్టను కోల్పోయిన కవిత ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ తో.. విమర్శలను ఎలా తిప్పికొట్టాలనే దానిపై సన్నిహితులతో చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశమున్నది. లిక్కర్ కేసుపై ఈడీ, సీబీఐ ఇప్పటివరకూ చేసిన దర్యాప్తు, చార్జిషీట్‌లో ప్రస్తావించిన అంశాలు, సాక్షులు, అప్రూవర్‌లుగా మారినవారి స్టేట్‌మెంట్ల ఆధారంగా అరెస్టు చేయడం, ఆధారాలను ట్రయల్ కోర్టులో చూపెట్టలేకపోవడం, రూ. 100 కోట్ల ముడుపులపై వచ్చిన ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడం, రాజకీయ అవసరాల కోసమే ఈ కేసును బీజేపీ వాడుకున్నదనే తన అభిప్రాయాన్ని వెల్లడించడం, సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా చేసిన కామెంట్లు.. ఇలాంటి అనేక అంశాలను మీడియా ద్వారా కవిత సంధించే అవకాశమున్నట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది.

కొన్ని రోజులు కుటుంబంతోనే!

ఐదున్నర నెలల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న కవిత కొన్ని రోజుల పాటు కుటుంబంతో గడిపి ఆ తర్వాతనే పొలిటికల్ యాక్టివిటీస్‌పై దృష్టి సారిస్తారని, ఇప్పటివరకూ తనపైన వచ్చిన అభియోగాలకు ఘాటుగా కౌంటర్ ఇవ్వడంపై తొలుత ఫోకస్ పెడతారని సన్నిహితుల సమాచారం. బీజేపీ ఒత్తిళ్లకు, బెదిరింపులకు లొంగిపోయినా, అప్రూవర్‌గా మారాలనే డిమాండ్‌కు తలొగ్గినా ఎప్పుడో బెయిల్‌పై బయటకు వచ్చేదాన్ని అనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి అంశాలనే మీడియాకు వెల్లడించి బీజేపీని కార్నర్ చేసే అవకాశాలనూ సన్నిహితులు తోసిపుచ్చలేదు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఢీకొట్టలేకనే ప్రణాళిక ప్రకారం బీజేపీ తనను పావుగా వాడుకున్నదని, తన అరెస్టుపై బీజేపీ నేతలు ముందుగానే జోస్యం చెప్పారనే అంశాలను కూడా ప్రస్తావించే చాన్స్ ఉన్నట్లు తెలిసింది.


Similar News