MLC Srinivas: ఇంత బడ్జెట్ ఎలా పెట్టగలిగారు?

రాష్ట్రంలో అభివృద్ధి లేనిదే జీడీపీ పెరిగిందా? అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.

Update: 2024-07-27 16:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అభివృద్ధి లేనిదే జీడీపీ పెరిగిందా? అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. శనివారం ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్‌ను రూ.2.90 లక్షల కోట్లు ఎలా ప్రతిపాదించారో? ఆలోచించాల్సిన అవసరం ఉన్నదన్నారు. అభివృద్ధి జరిగి, ఆదాయం సృష్టిస్తేనే కదా? ఈ మొత్తంలో పెట్టగలిగారు? అంటూ మండిపడ్డారు. గడిచిన 7 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ రూ.35 వేల కోట్ల అప్పు చేసిందన్నారు. అంటే ప్రతీ నెల సగటున 5 వేలు చొప్పున అప్పులు ఉన్నాయన్నారు. ఏడాదిలో లోపే లక్ష కోట్ల అప్పుకు చేరబోతున్నామన్నారు. బీఆర్ఎస్ హయంలో అభివృద్ధి జరగడం వలనే 4 కోట్ల టన్నుల పంటను ఉత్పత్తి చేయగలిగామన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రంగనాయక్ సాగర్ పూర్తై, లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చే కెపాసిటీకి చేరామన్నారు. గతంలో సిద్దిపేటకు నీళ్లు లేవని చెప్పారు. గత ప్రభుత్వం ప్లానింగ్‌తో చెరువులు, వాగులు, అలుగులు పొంగిపొర్లాయని, కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో నీళ్లు వృథా అవుతున్నాయన్నారు. నాలుగు వేలు ఫించన్లు ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు రూ.2500 ఎప్పుడిస్తారు? అని అడిగారు. ఆరు గ్యారంటీలకు చట్ట బద్ధత కల్పిస్తామని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదన్నారు. ఆర్ట్స్ కాలేజీ, సిటీ కాలేజీల్లో విద్యార్థులు, జర్నలిస్టులపై పోలీసుల దాడి సరికాదన్నారు.

Tags:    

Similar News