ఎమ్మెల్సీ యోగం ఎవరికి? కౌశిక్ రెడ్డి సీన్ రిపీట్ కాకుండా చర్యలు
మండలిలో మేలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో : మండలిలో మేలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై పడింది. ఎవరిని గులాబీ బాస్ ఎంపిక చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పదుల సంఖ్యలో నేతలు ఆశిస్తున్నారు. అయితే గతంలో కౌశిక్ రెడ్డి తరహాలో ఘటన పునరావృతం కాకుండా ఎంపిక విషయంలో ఆచితూచి కేసీఆర్ వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.
ఒకటి బీసీకి ఇవ్వనుండగా, మరొకటి క్రిస్టియన్ మైనార్టీ లేదా విద్యార్థి నాయకులకు అప్పగిస్తారనే ప్రచారం ఊపందుకుంది. తెలంగాణ శాసన మండలిలో మే 27న గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో క్రిస్టియన్ మైనార్టీ నుంచి డి. రాజేశ్వర్ రావు, ముస్లిం మైనార్టీ నుంచి ఫారూఖ్ హుస్సేన్ ఉన్నారు. ఇద్దరు మైనార్టీ కమ్యూనిటీకి చెందినవారు. అయితే ఇద్దరు కూడా మూడుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే నాలుగోసారి అవకాశం దక్కడం అరుదు. వీరిలో ఒకరికి మళ్లీ రెన్యూవల్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే పలువురి పేర్ల పరిశీలన..
టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, క్రైస్తవ మైనార్టీకి చెందిన విద్యాస్రవంతి, బీసీ కమ్యూనిటీకి చెందిన భిక్షమయ్యగౌడ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో పాటు బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి చెందిన ఒకరిద్దరి పేర్లు పరిశీలించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే కోటాలో 3 అసెంబ్లీ స్థానాలకు మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీసీలకు అవకాశం కల్పించకపోవడంతో ఈసారి ఒక స్థానాన్ని కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుంది.
అయితే ప్రభుత్వంపై విద్యార్థుల నుంచి వ్యతిరేకత ఎక్కువ అవుతుండటంతో ఒక స్థానాన్ని కేటాయిస్తారని, అయితే క్రైస్తవ మైనార్టీకి మొండిచెయి ఇస్తారా? అనేది కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. విద్యార్థి నాయకుల్లో ఒకరికి అవకాశం కల్పిస్తే రాబోయే ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా వినియోగించుకోవచ్చని పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్వీలో పనిచేసిన జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్, టెక్నికల్ సర్వీసెస్ రాష్ట్ర మాజీ చైర్మన్ చినుమల రాకేష్ పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఆచితూచి ఎంపిక...
తెలంగాణ కేబినెట్ కౌశిక్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకొని, ఆ ఫైల్ ను గవర్నర్ కు పంపగా దాదాపుగా మూడు నెలలు ఫైల్ ను పెండింగ్ లోనే పెట్టారు. కౌశిక్ రెడ్డిపై ఉన్న కేసులతోనే గవర్నర్ ఆమోదించలేదని ప్రచారం జరిగింది. దీంతో అలాంటి సమస్య పునరావృతం కాకుండా ఆచితూచి గులాబీ నేత కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. అభ్యర్థి ఏ రంగంలో నిష్ణాతుడు.. ఆయన కమ్యూనిటీ ఏంటీ? కేసులు ఉన్నాయా? తదితర వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది.
కేబినెట్ మీటింగ్ లోపే నిర్ణయం..
వచ్చే నెల రెండోవారంలో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఆ లోగానే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇప్పటికే పలువురి బయోడేటాను సైతం అధిష్టానం తెప్పించుకుందని సమాచారం. కేటీఆర్ సైతం పలువురి పేర్లను సూచించినట్లు తెలిసింది. ఎవరికి ఎంపిక చేస్తారనేది మాత్రం పార్టీవర్గాల్లో చర్చనీయాంశమైంది.
పలువురికి హామీలు...
ఎన్నికల సమయంలో, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన సందర్భంలో కేసీఆర్, కేటీఆర్ లు పలువురు సీనియర్ నేతలకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని హామీలు ఇచ్చారు. అందులో బీఆర్ఎస్ కోదాడ నాయకుడు శశిధర్ రెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన మోత్కుపల్లి నర్సింహులు, ఉమా మాధవరెడ్డిలనూ ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సైతం ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. ఖమ్మం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, సత్తుపల్లి సెగ్మెంట్ కు చెందిన మట్టా దయానంద్, దిండిగాల రాజేందర్‌కు ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు.
ఇదే జిల్లా నుంచి పాయం వెంకటేశ్వర్లు, వ్యాపారవేత్తలు రాజేంద్రప్రసాద్ కూడా రేసులో ఉన్నారు. ఇక్కడి నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అయిన బాలసాని లక్ష్మీనారాయణ మరోసారి చాన్స్ కోరుతున్నారు. మెదక్ నుంచి గ్యాదరి బాలమల్లు, రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ మేయర్లు తీగల కృష్ణారెడ్డి, క్యామ మల్లేశ్‌కూ హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ నుంచి శాట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, గట్టు తిమ్మప్పకీ సీఎం హామీ ఇచ్చారు.
కరీంనగర్ నుంచి పెద్దిరెడ్డితో పాటు రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎల్పీ సెక్రటరీ రమేశ్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడం నగేశ్, శ్రీహరిరావు, సత్యనారాయణగౌడ్, వరంగల్ నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్, గుడిమల్ల రవికుమార్, నూకల నరేశ్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ నుంచి అరికెల నర్సారెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావులను మండలికి పంపుతానని సీఎం హామీ ఇచ్చారు. మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్, అరిగెల నాగేశ్వర్‌రావు, లోక భూమారెడ్డి, తుల శ్రీనివాస్, మైనార్టీ నాయకులు అలీం, ముజీబ్‌తో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి సోదరుడు అజయ్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు.