19 ఏళ్లుగా ఆ గ్రామాల్లో నో ఎలక్షన్స్.. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆవేదన

పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.

Update: 2024-02-15 14:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. పినపాక ఆదివాసీలు ఎక్కువగా ఉండే ప్రాంతమన్నారు. మణుగూరు మండలంలో మణుగూరు గ్రామ పంచాయతీగా ఉన్నదాన్ని 2005 సంవత్సరంలో మణుగూరు మున్సిపాలిటీగా చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు.. అంటే సుమారు 19 సంవత్సరాలు అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదని ఎమ్మెల్యే చెప్పారు.

ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఆ ప్రాంతానికి ప్రత్యేక చట్టాలున్నాయన్నారు. మున్సిపాలిటి అయిన తర్వాత కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. దీంతో మణుగూరు మున్సిపాలిటీ అయిన సందర్భంలో 13 గ్రామీన ప్రాంతాలను వ్యవసాయ కూలీ చేసుకుని కుటుంబాలను ఆ మున్సిపాలిటీలో కలపడం వల్ల.. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పని చేసుకునే అర్హత కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు.

మున్సిపాలిటీ కావడం వల్ల ఆ గ్రామాలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్తించడం లేదన్నారు. వ్యవసాయం లేని సమయంలో వ్యవసాయ కూలీలు పనులు చేసుకోవడానికి వచ్చే పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకమని తెలియజేశారు. అందులో అర్హత కోల్పోయిన గ్రామాలు 13 ఉన్నాయని, అదేవిధంగా 19 ఏళ్ల నుంచి ఎన్నికలు కూడా జరగడం లేదని తెలిపారు. ఇటు ఎన్నికలు లేక, ఉపాధి హామీ పథకం లేక, ఇంటి పన్నులు కట్టలేక వందలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గత ప్రభుత్వానికి సైతం ఈ విషయం చెప్పినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. మణుగూరు మున్సిపాలిటీలో ఉన్న 13 గ్రామీణ ప్రాంతాలను విడదీసి, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి.. వ్యవసాయ కూలీ పనులు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News