బీఆర్ఎస్‌కు మరో షాకిచ్చిన CM రేవంత్ రెడ్డిని కలిసిన MLA
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆ పార్టీ నేతలకు వరుస షాక్‌లు ఇస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆ పార్టీ నేతలకు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు కుటుంబసమేతంగా సీఎం రేవంత్ రెడ్డి కలిసిన ఆయన.. ఇవాళ మరో షాకిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరిక ఖరారైందంటూ ఉమ్మడి ఖమ్మంలో గుసగుసలు మొదలయ్యాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది.
ఈ క్రమంలోనే వరుసగా రాష్ట్రంలోని ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో వరుసగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇవాళ మహబూబాబాద్ నేతలతో సమావేశమయ్యారు. అయితే, అనూహ్యంగా ఈ సమావేశానికి తెల్లం వెంకట్రావు గైర్హాజరు కావడం ఆసక్తిగా మారింది. దీంతో ఆయన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన తెల్లం వెంకట్రావు.. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి టికెట్ రాదని తెలిసి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి భద్రాచలం నుండి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిపొందారు.