ఫాంహౌజ్ కేసు: సుప్రీంకోర్టుకు రాష్ట్ర సర్కార్!
మొయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది. ఏసీబీ కోర్టులో చుక్కెదురుకావడంతో హైకోర్టును ఆశ్రయించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: మొయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది. ఏసీబీ కోర్టులో చుక్కెదురుకావడంతో హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ సింగిల్ జడ్జి బెంచ్‌లో ప్రతికూల తీర్పు రావడంతో డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసింది. ఇక్కడ వచ్చే ఉత్తర్వులకు అనుగుణంగా సుప్రీంకోర్టుకు సైతం వెళ్లాలని భావిస్తున్నది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డితో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసుకున్నది. దీనిపై అన్ని వైపుల నుంచి సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం విచారణ సోమవారానికి వాయిదా పడింది. డివిజన్ బెంచ్‌లోనూ ఆశించిన విధంగా తీర్పు రాకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ఇప్పటికే సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు అధికారుల సమాచారం. ఈ కేసు సీబీఐకి బదిలీ కావడం ఇష్టంలేని సర్కారు.. అన్ని మార్గల్లో లీగల్ గా ఫైట్ చేయాలని ఆలోచిస్తున్నది. హైకోర్టు నుంచి తీర్పు వెలువడిన వెంటనే దానికి తగినట్టుగా దర్యాప్తు ప్రారంభించాలని భావిస్తున్న సీబీఐ.. ఢిల్లీ నుంచి అధికారుల బృందాన్ని హైదరాబాద్‌లో సిద్ధంగా ఉంచింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నుంచి డాక్యుమెంట్లను తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న ఆతృతతో ఉన్నది. ఇదే విషయాన్ని విచారణ సందర్భంగా హైకోర్టు సీజే బెంచ్ ముందు సైతం సీబీఐ తరఫున హాజరైన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. దీన్ని పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నుంచి తీర్పు వచ్చిన వెంటనే అవసరమైతే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేయడానికే మొగ్గు చూపుతున్నది.
తదుపరి యాక్షన్ ప్లాన్‌కు సన్నద్ధం
సింగిల్ జడ్జి బెంచ్ తన తీర్పులో సిట్ ఏర్పాటును రద్దు చేయడంతో పాటు జీవోను కూడా కొట్టివేసింది. 'సిట్' అనేదే లేనప్పుడు ఇక కేసు ఎక్కడుందంటూ సర్కారు తరఫు న్యాయవాది దుష్యంత్ దవే హైకోర్టు సీజే ముందు వాదనలు లేవనెత్తారు. సీబీఐ దర్యాప్తు పారదర్శకంగా జరగదని, కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతుందని, అందువల్ల బదిలీ చేయడం సహేతుకం కాదని కూడా వాదించారు. వీటన్నింటి నేపథ్యంలో సీజే బెంచ్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఆ తీర్పుకు అనుగుణంగా ఇప్పటికే రూపొందించుకున్న తదుపరి యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. సీజే బెంచ్ తీర్పు వెలువడడంతోనే సీబీఐకి డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉన్నందున అది ఇష్టం లేని రాష్ట్ర సర్కారు గంటల వ్యవధిలోనే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేయాలని అనుకుంటున్నది.
నేడు విచారణ
ఇప్పటికే ఎస్ఎల్‌పీ కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్యుమెంట్లను సీబీఐకి ఇచ్చే ప్రసక్తే లేదనే స్పష్టమైన భావనతో ఉన్నది. హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత అందులోని అంశాలను చివరి నిమిషంలో ఎస్ఎల్‌పీలో చేర్చి మంగళవారమే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి తగిన ఏర్పాట్లను ప్రభుత్వం చేసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే.. దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ ప్రభుత్వం తరఫున వాదిస్తారని అధికారుల సమాచారం. హైకోర్టులో సోమవారం జరిగే విచారణకు ఢిల్లీ నుంచే వీడియో కాన్ఫరెన్సు (వర్చువల్ హియరింగ్) పద్ధతిలో వాదించనున్నారు.
తీర్పుపై ఉత్కంఠ
మొయినాబాద్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, డాక్యుమెంట్లు, ఎవిడెన్సు, ముగ్గురు నిందితుల స్టేట్‌మెంట్లు తదితరాలన్నింటినీ ఇవ్వాల్విందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీబీఐ ఇప్పటికే లేఖ రాసింది. హైకోర్టు సైతం ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ డైరెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ వెలువరించిన ఉత్తర్వులు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీని సీబీఐ తీసుకున్నది. హైకోర్టు సీజే బెంచ్ తీర్పును వెలువరించగానే దానికి తగిన విధంగా ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించాలనుకుంటున్నది సీబీఐ. ఏయే సెక్షన్ల కింద కేసును నమోదు చేయాలో ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపింది. ఢిల్లీ నుంచి ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో వచ్చిన సీబీఐ బృందం మూడు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డాక్యుమెంట్లు, ఎఫ్ఐఆర్, ఇతర పత్రాలు అందడం లేదంటూ విచారణ సందర్భంగా డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హైకోర్టు సీజే దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం వరకూ విచారణ వాయిదా పడినందున అప్పటివరకూ వీటి కోసం ఒత్తిడి చేయవద్దంటూ సీబీఐకి సీజే సూచించారు. ప్రస్తుతం సర్కారు దృష్టంతా సీజే బెంచ్ ఎలాంటి తీర్పు ఇస్తుందనే అంశంపైనే కేంద్రీకృతమైంది.
Also Read...