ఆ పిచ్చితోనే ఇంకా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
‘‘గాంధీభవన్‌లో ప్రశాంతత లేదు. మానసికంగా కృంగిపోతున్నా. గతంలో ప్రతి రోజు గాంధీభవన్‌లో కూర్చొని ఆనందించేవాడిని.
దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘గాంధీభవన్‌లో ప్రశాంతత లేదు. మానసికంగా కృంగిపోతున్నా. గతంలో ప్రతి రోజు గాంధీభవన్‌లో కూర్చొని ఆనందించేవాడిని. కానీ 5 నెలల నుండి రాజకీయాకంగా గాంధీభవన్‌కి రాలేని పరిస్థితి. గాంధీభవన్‌లో కూర్చొని అనేక సమస్యలను మర్చిపోయిన రోజులున్నాయి. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చునే పరిస్థితి కరువైపోయింది. చాలా బాధ ఉన్నది.” అంటూ టీ కాంగ్రెస్ సీనియర్ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీభవన్పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఆయన బుధవారం ఓ ప్రటకనను విడుదల చేశారు. రాహుల్ గాంధీ త్యాగల కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆ పిచ్చితోనే కాంగ్రెస్‌పార్టీలో కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
అయితే గత కొన్ని రోజుల నుంచి పార్టీలో ఎన్ని మార్పులు వచ్చాయని, స్వయంగా తాను ఎంతో మనోవేదనకు గురికావాల్సి వస్తుందన్నారు. పార్టీని బలోపేతం కోసం ప్రయత్నిస్తున్నా.. పార్టీలోని కొందరు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోందన్నారు. బయటకు చెప్తే? ఏం జరుగుతుందో? తెలియక లోలోపల బాధపడాల్సి వస్తుందన్నారు. అయితే జగ్గారెడ్డి ఇలా సడన్గామాట్లాడటానికి కారణాలు ఏమై ఉండొచ్చన్న చర్చ ఇప్పుడు ఆ పార్టీలో జోరుగా జరుగుతుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే సీనియర్కాంగ్రెస్నేతల్లో దాదాపు 90 శాతం మంది గాంధీభవన్‌ను అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. టీపీసీసీ వర్గం తమను పట్టించుకోవడంలేదనే ఆరోపణ నిత్యకృత్యమైంది.