ప్రజాస్వామ్య విలువలు మంట గలిపేలా ప్రభుత్వం తీరు: హరీష్ రావు

మేడిగడ్డలో తప్పు జరిగితే విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్య తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రాజెక్టు పునరుద్దరణ పనులు చేయాలని సూచించారు.

Update: 2024-02-13 14:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డలో తప్పు జరిగితే విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్య తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రాజెక్టు పునరుద్దరణ పనులు చేయాలని సూచించారు. మేడిగడ్డను బూచీగా చూపేప్రయత్నం మానుకోవాలని సూచించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతో ప్రాజెక్ట్ పునరుద్దరణ చేయడం లేదని ఆరోపించారు. రాజకీయాల కోసం రైతులకు ఇబ్బంది పెట్టొద్దని, నష్ట పోతారని ప్రజలు క్షమించరన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరాన్ని అద్భుతంగా నిర్మించి నీళ్లు ఇస్తున్నామన్నారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డనే కాదని.. అది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం కలగలిసిన సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పారు. ఒక్క బ్యారేజీలో ఒకటి రెండు కుంగిపోతే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

శాసనసభలో సభా సంప్రదాయాలను ఉల్లంఘించారని అన్నారు. అధికారపక్షం మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకపోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. మేడిగడ్డ పర్యటన ద్వారా బీఆర్ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లబ్ధిపొందిన ప్రజలను అడగాలని ప్రభుత్వానికి సూచించారు. మేడిగడ్డ సందర్శనలో భాగంగా వెళ్లే దారిలో రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడాలన్నారు. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రంగనాయకసాగర్‌ను చూసి అద్భుతమని మెచ్చుకున్నారని గుర్చుచేశారు. ప్రాజెక్టును సరిదిద్దే ప్రయత్నం చేయాలని సూచించారు. చాప్రాల్‌ వైల్డ్‌ లైఫ్‌ ప్రాంతంలో ప్రాణహిత కట్టాలని చూస్తే అనేక అడ్డంకులు వస్తాయని చెప్పారన్నారు. నాడు కేంద్రం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. ప్రాణహిత చేవెళ్లను ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. తాము నీళ్లు లేని ప్రాంతం నుంచి ప్రాజెక్టును తరలించి పంటలకు నీళ్లు అందించామని, మూడు కోట్ల మెట్రిక్‌ టన్నుల పంట పండిందంటే ఆ జలాల వల్లే జరిగిందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ హయాంలో పంజాగుట్ట ఫ్లై ఓవర్‌ కూలి 20 మంది చనిపోయారని, దేవాదుల పైపులు పేలి నీళ్లు ఆకాశమంత ఎగిరాయన్నారు. అలాంటి ఘటనలు జరగడం బాధాకరమని చెప్పారు. కానీ తాము ముందుకు వెళ్లాం కదా అని తెలిపారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించొద్దని తాము నిద్ర లేపితే లేచారని, బీఆర్‌ఎస్‌ సభ ఉందని కాంగ్రెస్ డైవర్ట్‌ చేయడం కోసం పోటీ కార్యక్రమం పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నీతిని ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి ఉన్నారు.

Tags:    

Similar News