ఫస్ట్ ప్రయారిటీ వాళ్లకే.. గృహలక్ష్మి పథకంపై మంత్రి వేముల కీలక వ్యాఖ్యలు
ఖాళీ స్థలం ఉంటే అర్హులు ఎవరైనా గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అని మంత్రి వేముల ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకం దరఖాస్తులపై గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో తాజాగా ఈ స్కీమ్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు బుధవారం నోట్ రిలీజ్ చేసిన ఆయన దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలను నమ్మొద్దన్నారు. గ్రామ కంఠంలోని పాత ఇళ్లు, స్థలాలకు దస్తావేజు పేపర్లు ఉండవని అందువల్ల ఇంటి నెంబర్ లేనప్పటికీ ఖాళీ స్థలం ఉన్న వారు ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తుదారులు ప్రజాప్రతినిధులతో కలెక్టర్‌కు దరఖాస్తులు పంపించవచ్చు అని మంత్రి పేర్కొన్నారు.
మొదటి దశలో నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు ఇస్తున్నామని ఇవి పూర్తయిన అనంతరం రెండో దశ కోసం దరఖాస్తులు తీసుకుంటామన్నారు. దశలవారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మొదటి విడతలో ఈనెల 10వ తేదీవరకు వచ్చిన దరఖాస్తులకు మొదటి ప్రయారిటీ ఇస్తామని తెలిపారు. కాగా, గృహలక్ష్మి పథకానికి గడువు తక్కువ సమయం ఉండటంతో దరఖాస్తు చేసేందుకు జనం ప్రభుత్వ కార్యాలయాలకు బారులు తీరుతున్నారు. మరో వైపు ఈ స్కీమ్ పై ప్రభుత్వం పెట్టిన నిబంధనలపై సామాన్య ప్రజలతో పాటు సొంత పార్టీ నేతల్లోనూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీసీ బంధు విషయంలోనూ ఇలాంటి గందరగోళమే సృష్టించారని ఎన్నికల వేళ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణలు సైతం సోషల్ మీడియా వేదికగా పెదవి విరుస్తున్నాయి.
Read More : ‘గృహలక్ష్మి’ ఎఫెక్ట్.. మహిళలకు సరికొత్త తిప్పలు!