Uttam Kumar Reddy : నీటి పారుదల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు
నీటి పారుదల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: నీటి పారుదల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ జలసౌధలో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో ఉత్తమ్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదని తెలిపారు. నీటి పారుదల శాఖకు నిధుల కేటాయింపులు బాగున్నాయని.. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పనులు లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేయాలన్నారు. అధికారులకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తయేలా చూసే బాధ్యత అధికారులదే అన్నారు. ఎట్టి పరిస్థితులలో పనులు సకాలంలో పూర్తి కావాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు. పనులు క్వాలిటీగా పూర్తి చేసిన ఆఫీసర్లను గుర్తిస్తామని హామీ ఇచ్చారు. పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు.
కమిట్మెంట్, సిన్సియారిటీ తప్పకుండా ఉండాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులలో ఆలస్యం చేసే కాంట్రాక్టర్లు, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పనులు బాధ్యతగా చేయాలని.. పనులు సకాలంలో పూర్తి కావాల్సిందే అన్నారు. నిబంధనలకు అనుగుణంగా పనులు జరగాలన్నారు. ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే విజ్ఞప్తులను వెంటవెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రజా ధనం అత్యంత విలువైనదని.. ప్రతి పైసా చాలా జాగ్రత్తగా వ్యయం చేయాలన్నారు. ఉన్నతాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా పనులు చేయకుండా.. క్రమశిక్షణగా పనులు చేసి టార్గెట్ పూర్తి చేయాలన్నారు.