సాగర్ ఎడమ కాలువ గండి మరమ్మతుల ఆలస్యంపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం

నాగార్జునసాగర్ ఎడమ కాలువ గండి మరమ్మతు పనుల ఆలస్యంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-09-24 10:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : నాగార్జునసాగర్ ఎడమ కాలువ గండి మరమ్మతు పనుల ఆలస్యంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం, కాగిత రామచంద్రపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువ గండిని మంగళవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఉత్తమ్ పరిశీలించారు. మరమ్మతు పనుల్లో ఆలస్యంతో తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులపై మంత్రి మండిపడ్డారు. పనులలో అలసత్వం వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేస్తానంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. నిర్మాణ పనులు ఎందుకు ఆలస్యం జరిగిందని ప్రశ్నించారు. రైతులుకు ఇబ్బంది లేకుండా సాగునీటి సమస్య ఏర్పడకుండా పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు రోజు కూడా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కాలువ గండి పనులను పరిశీలించి పనుల జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోయాక మరమ్మతులు చేస్తారా అంటూ ఆగ్రహం వెళ్ళగక్కారు.


Similar News