రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు క్లారిటీ

ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

Update: 2024-09-03 12:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంగళవారం తుమ్మల మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు 22 లక్షల రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమ చేశామని తెలిపారు. ఇంకా మరికొంతమందికి రుణమాఫీ కాలేదని.. ఆ విషయం తమ దృష్టిలో ఉందని అన్నారు. త్వరలోనే రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. వరదల కారణంగా ఖమ్మం జిల్లాలో ఎక్కువ పంటనష్టం జరిగిందని వెల్లడించారు. పంటనష్టపోయిన రైతులు అందరికీ పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

అంతేకాదు.. చెరువులు, కాలువలకు మరమ్మతులు చేస్తామని అన్నారు. ‘మున్నేరు వరదలతో 10 డివిజన్లు నీటమునిగాయి. రెండు రోజుల్లో విద్యుత్‌ పునరుద్ధరిస్తాం. 12 హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేశాం’ మంత్రి తుమ్మల తెలిపారు. రుణమాఫీ చేశామనే సంతోషం తమకు కొన్ని రోజులుగా కూడా లేదని.. ఇంతలోనే వరద రూపంలో విపత్తు వచ్చి ప్రజలను అల్లకల్లోలం చేసిందని అన్నారు. ఎక్కువగా ఖమ్మం, ఆ తర్వాత సూర్యాపేట, ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంటనష్టం జరిగిందని తెలిపారు.


Similar News