రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక సూచన
వరి కొయ్యకాలు తగలపెట్టవద్దని, వ్యవసాయ అధికారులు వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను మంత్రి
దిశ, తెలంగాణ బ్యూరో: వరి కొయ్యకాలు తగలపెట్టవద్దని, వ్యవసాయ అధికారులు వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. కొయ్యలను కాల్చకుండా ఇక ముందు వీటిని నిరోధించే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు. కొయ్యలను కాల్చడం వల్ల అనేక ప్రమాదాలు సంభవించడమే కాకుండా ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు పర్యావరణ ఆరోగ్యం కూడా దెబ్బ తింటుందని మంత్రి తెలిపారు. దీనిపై అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులు మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
వరి కొయ్యకాలకు నిప్పుపెడితే భూమి సారాన్ని కోల్పోవడంతో పాటు దిగుబడి తగ్గుతుందని అలాగే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. పొలాన్ని కలియ దున్నితేనే పంటకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. గతంలో వరి పంటను కొడవళ్లతో మొదళ్ల దాకా కోసేవారు. అంతేకాకుండా పశువులు ఎక్కువగా ఉండటంతో గడ్డిని కుప్పలుకుప్పలుగా పశుగ్రాసం కోసం నిల్వ చేసేవారు. అయితే ప్రస్తుతం సాగు విధానంలో అనే క మార్పులు రావడం, పశువుల సంఖ్య తగ్గిపోవడంతో యంత్రాలను విరివిగా వినియోగిస్తున్నారు.
మిషన్‌తో హార్వెస్టింగ్ చేసే సమయంలో పైకి కోయడం ద్వారా కొయ్యలు మిగిలిపోతున్నాయి. అవసరమున్న రైతులు కొంత గడ్డిని కోసి తీసుకొచ్చుకుని మిగిలిన దానిని అక్కడే వదిలేస్తున్నారు. దీంతో దున్నే సమయంలో నాగళ్లకు అడ్డుగా వస్తున్నాయని రైతులు వరికొయ్యలతో పాటు గడ్డిని కూడా కాలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల అధిక నష్టాలు వచ్చే అవకాశముందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వరికొయ్యలను తగులబెట్టొద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
సారాన్ని కోల్పోతుంది
వరికొయ్యలను (కొయ్యకాలు) కాల్చితే నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. కాల్చడం ద్వారా విపరీతమైన వేడితో భూమి సారాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా నత్రజని, ఫాస్ఫరస్ లాంటి పోషక పదార్థాల శాతం తగ్గుతుంది. దిగుబడి పోతుంది. భూమికి పీచు పదార్థంగా ఉపయోగపడే అవశేషాలు కాలిపోతాయి. పంటలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయి.
పొలాల్లో తిరిగే పాములు, ఉడుములు, నెమళ్లు, తొండలు ఇలా అనేక జీవరాసులు చనిపోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. పొలాల గట్లు, మొరం గడ్డలపై ఉన్న పచ్చని చెట్లు కాలిపోవడంతో పర్యావరణానికి హాని కలుగుతుంది. ఆలస్యంగా కోతకు వచ్చే పంటలు, కల్లాల దగ్గరే ఉన్న ధాన్యం కాలిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
వరి కొయ్యలకు నిప్పు పెట్టడం వల్ల గాలి, నేల కలుషితమవుతుంది. పంటలకు మేలుచేసే మిత్ర పురుగులు మరణిస్తాయి. వరి కొయ్యలను పొలంలో కలియ దున్నితే సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఎకరానికి దాదాపు టన్ను ఎరువు తయారవుతుంది. దున్నే ముందు తప్పనిసరిగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లితే వరికొయ్యలు, గడ్డి మొక్కలు తొందరగా కుళ్లిపోతాయి. మురిగిన కొయ్యలు ఎరువుగా మారడటంతో దిగుబడి పెరుగుతుంది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించొచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.