కేసీఆర్ భాష తీరుపై మండిపడ్డ మంత్రి శ్రీధర్ బాబు
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సిరిసిల్లలో ఎండిపోయిన పంటలను స్థానిక బీఆర్‌ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సిరిసిల్లలో ఎండిపోయిన పంటలను స్థానిక బీఆర్‌ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల్లో తెలంగాణ ఎడారి అయ్యిందన్నారు. నీటి నిర్వహణ తెలియని దద్దమ్మలు రాజ్యమేలుతున్నారని ఆరోపించారు. వంద రోజుల్లో 200 మంది చనిపోయారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలపై మంథని ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు శనివారం మీడియా సమావేశంలో స్పందించి.. పది ఏళ్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి, కేంద్రమంత్రి, మంత్రుల హోదాలో సేవలందించిన కేసీఆర్ భాష తీరు ఎబ్బెట్టుగా ఉందని అన్నారు. కేసీఆర్ తన భాష తీరు మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే మాజీ సీఎం అవినీతి కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని పేర్కొన్నారు.