కేంద్ర మంత్రికి తెలంగాణ మంత్రి సీతక్క కీలక రిక్వెస్ట్

తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త అంగ‌న్ వాడి సెంట‌ర్లను మంజూరు చేయాల‌ని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క కోరారు.

Update: 2024-08-10 15:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త అంగ‌న్ వాడి సెంట‌ర్లను మంజూరు చేయాల‌ని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క కోరారు. అంగ‌న్ వాడి సెంట‌ర్లలో మెరుగైన సేవ‌లు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్దిక స‌హ‌కారాన్ని పెంచాల‌ని విన్నవించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రుల‌తో కేంద్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్న పూర్ణాదేవి శ‌నివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లోని మహిళా శిశు సంక్షేమ శాఖలో అమలవుతున్న పథకాలు, ఎదురవుతున్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా స‌చివాల‌యం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీత‌క్క, తెలంగాణ‌లో అమ‌లవుత‌న్న ప్రత్యేక సంక్షేమ ప‌థ‌కాల‌ను మంత్రి సీత‌క్క వివ‌రించారు. మ‌హిళా శిశు సంక్షేమ శాఖ అవ‌స‌రాల‌ను కేంద్రం ముందుంచారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త అంగ‌న్ వాడి సెంట‌ర్లను మంజూరు చేయాల‌ని కేంద్రాన్ని కోరారు. అంగ‌న్ వాడీ కేంద్రాల్లో టీచ‌ర్లు వినియోగిస్తున్న మోబైల్ ఫోన్ల స్థానంలో ట్యాబ్‌లు మంజూరు చేయాల‌ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగ‌న్ వాడీ కేంద్రాల్లో ఏడు నెల‌ల నుంచి 6 సంవత్సరాల మ‌ద్య వ‌య‌సు గ‌ల 14, 83, 940 చిన్నారుల‌కు, 3,45,458 మంది గ‌ర్భిణీ , బాలింత‌ల‌కు సేవ‌లందిస్తున్నట్లు తెలిపారు.

3,989 మిని అంగ‌న్ వాడీల‌ను మెయిన్ అంగ‌న్ వాడీ సెంట‌ర్లుగా అప్ గ్రేడ్ చేసిన‌ట్లు చెప్పారు. అంగ‌న్ వాడీ కేంద్రాల్లో న‌ర్సీరీ క్లాస్ ల‌ను త్వర‌లో ప్రారంభిస్తున్నట్టు, టీచ‌ర్లకు అవ‌స‌ర‌మైన ట్రేనింగ్ ను పూర్తి చేసిన‌ట్లు మంత్రి సీత‌క్క చెప్పుకొచ్చారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగ‌న్ వాడీ చిన్నారుల‌కు రంగు రంగుల యూనిఫాంలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అంగ‌న్ వాడి కేంద్రాల్లో బుక్ ర్యాక్స్, చౌకీలు, ప్లేయిన్ మాట్స్, థీమ్ బేస్డ్ పేయింటిగ్స్ త‌దిత‌ర మౌళిక స‌దుపాయ‌ల‌ను అందిస్తున్నట్లు తెలిపారు. అంగ‌న్ వాడీ టీచ‌ర్లకు నెల‌కు రూ. 13, 650, ఆయాల‌కు రూ. 7800 చొప్పున గౌర‌వ వేత‌నం అందచేస్తున్నట్లు చెప్పారు. వారి వేత‌నాల్లో 67 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భ‌రిస్తుంద‌ని.. కేంద్రం త‌న వాటాను పెంచాలని కోరారు.

అంగ‌న్ వాడీ సెంట‌ర్ల‌ల ద్వారా కిషోర బాలిక‌ల్లో రక్త హీన‌త త‌గ్గించ‌డానికి రాగి ల‌డ్డుల‌ను ప్రయోగాత్మంగా మూడు జిల్లాలో ప్రారంభించిన‌ట్లు చెప్పుకొచ్చారు. ఆప‌రేష‌న్ ముస్కాన్ ద్వారా జూలై మాసంలో 2755 పిల్ల‌ల‌ను రెస్క్యూ చేసిన‌ట్లు చెప్పారు. దుర‌దృష్టవ‌శాత్తూ మ‌ర‌ణించిన‌ అంగ‌న్ వాడి టీచ‌ర్ల అంత్యక్రియ‌ల కోసం రూ. 20 వేలు, ఆయాల‌కు రూ. 10 వేలు అందజేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీత‌క్కతో పాటు మ‌హిళా శిశు సంక్షేమ శాఖ కార్యద‌ర్శి వాకాటి క‌రుణ‌, క‌మీష‌న‌ర్ కాంతి వెస్లి త‌దిత‌ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీతక్క ప్రతిపాద‌న‌ల‌కు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి

సీతక్క ప్రతిపాద‌న‌ల‌కు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా కొత్త అంగ‌న్ వాడి సెంట‌ర్ల మంజూరుపై త్వర‌లో నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. మిని అంగ‌న్ వాడీ సెంట‌ర్లను మెయిన్ అంగ‌న్ వాడి సెంట‌ర్లుగా తెలంగాణ లో అప్ గ్రేడ్ చేయ‌డాన్ని కేంద్ర మంత్రి అబినందించారు. మ‌రిన్ని మిని సెంట‌ర్ల‌ను అప్ గ్రేడ్ చేసేందుకు త‌మ వంతు స‌హ‌కారం అందిస్తామ‌న్నారు. త‌మ ప్రతిపాద‌ల‌కు సానుకూలంగా స్పందించిన మంత్రి సీత‌క్క ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News