నీ ప్రతిమాటా దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి మాటా దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని మంత్రి సీతక్క విమర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి మాటా దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని మంత్రి సీతక్క విమర్శించారు. ఇవాళ ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌పై తీవ్ర విమర్శలుచేశారు. అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ కుటుంబమని పేర్కొన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. 'దొర' అహంకారానికి ప్రతిరూపం గత బీఆర్ఎస్ పాలన అని ఆరోపించారు.
ప్రజాపాలనకి నిలువెత్తు నిదర్శనం కాంగ్రెస్ పాలన అని పేర్కొన్నారు. అధికారం లేనప్పుడు తెలంగాణ ఉద్యమ ముసుగు కప్పుకొని, అధికారంలోకి వచ్చాక ప్రజలకు బానిసల కంటే హీనంగా చూసిన మీ చరిత్రని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని విమర్శలు చేశారు. కాగా, ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గుంపు మేస్త్రీ అంటూ పరోక్షంగా రేవంత్ పాలన పై సెటైర్లు వేశారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ ఫెవికల్ బంధమంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.