సమగ్ర సర్వేకు బీఆర్‌ఎస్ ఆటంకం.. మంత్రి సీతక్క సంచలన పిలుపు
బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు....
దిశ, తెలంగాణ బ్యూరో: అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు బీఆర్‌ఎస్ ఆటంకంగా మారిందని, అందుకే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు బీఆర్ఎస్ అడ్డుపడుతుందని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. సోమవారం సచివాలయంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కుల గణన కోసం వచ్చే అధికారులను నిలదీయాలని కేటీఆర్ పిలుపు ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. కులగణనను అడ్డుకునేలా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ ను బీసీ సంఘాలు నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. కులగణనకు అడ్డుపడుతున్న బీఆర్ఎస్ వైఖరిని కుల అన్ని కుల సంఘాలు ఎండగట్టాలని కోరారు. కుల గణనను అడ్డుకుంటే బీసీ ద్రోహిగా బీఆర్ఎస్ మిగిలిపోవడం ఖాయమని హెచ్చరించారు. విదేశాల నుంచి రప్పించి మరీ బీఆర్ఎస్ కుటుంబ సర్వే చేసి ప్రజలకు నయా పైసా ప్రయోజనం చేయలేదన్నారు. సామాజిక వర్గాల వారిగా జనాభా లెక్క తేలితేనే, సంక్షేమ వాటా సాధ్యమవుతుందన్నారు. తాము చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వేను బహిష్కరించడం అంటే తమ హక్కులను, అభివృద్దిని వదులుకోవడమే అని వివరించారు. ధర్నా చౌక్ ఎత్తిసినోళ్లే ధర్నాకు దిగడం విచిత్రంగా ఉన్నదన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీలకే రూ. 54 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నదన్నారు.
ఇక క్లబ్బులు, పబ్బులు బంద్ అయ్యాక కొందరు నేతలు అరాచకంగా తయారయ్యారని, విజ్ఞత లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సీతక్క మండిపడ్డారు. బీఆర్ఎస్ చెప్పుడు మాటలు నమ్మకుండా గత పదేండ్లలో జరిగిన నష్టాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? ఎంత రుణ మాఫీ జరిగిందో ఆలోచించాలన్నారు. అట్టడుగు వర్గాలకు అందబోయే ప్రయోజనాలను అడ్డుకునేందుకే బీఆర్ఎస్ ఇంటింటి సర్వే ను వ్యతిరేకిస్తుందన్నారు. ఒక్క కేసీఆర్ కుటుంబానికి తప్ప ఏవరికీ లబ్ది జరగకూడదనే ఉద్దేశంతోనే ఇంటింటి సర్వేను బీఆర్ఎస్ అడ్డుకుంటుందని సీతక్క మండిపడ్డారు. మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. కేసులు నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి బీ టీం గా బీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం,కేవలం 27 రోజుల్లోనే 18 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది సాధ్యం కాలేదన్నారు. సచివాలయానికి ముఖ్యమంత్రి కూడా రాలేని పరిస్థితులు ఉండేవని, కానీ తమ ప్రభుత్వంలోనే తామే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు.