మంత్రి పొన్నం ప్రత్యేక చొరవ.. ఆ ఖాళీల భర్తీకి ఆమోదం

స్టేట్ ట్రాన్స్ పోర్టు అథారిటీలో ప్రమోషన్లకు డీపీసీ ఆమోదం ఇచ్చింది.

Update: 2024-11-26 02:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: స్టేట్ ట్రాన్స్ పోర్టు అథారిటీలో ప్రమోషన్లకు డీపీసీ ఆమోదం ఇచ్చింది. ఏస్టీఏలో సోమవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ నేతృత్వంలోని డిపార్ట్ మెంట్ ప్రమోషన్స్ కమిటీ (డీపీసీ) భేటీ అయి.. ఖాళీగా ఉన్న జేటీసీ, డీటీసీ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయడానికి ఆమోదం తెలిపింది. రంగారెడ్డి, మహబూబ్ నగర్ డీటీసీలు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్యలను జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లుగా పదోన్నతులు కల్పించింది. ఉప్పల్, నాగోల్, ఖమ్మం, మెహదీపట్నం, కొత్తగూడెం, సూర్యాపేట ఆర్టీవోలు వాణి, రవీందర్ కుమార్, ఆఫ్రిన్, కిషన్, సదానందం, సురేశ్ రెడ్డి లను డీటీసీలుగా ప్రమోషన్ ఇచ్చింది. వీటికి సంబంధించి ఒకటీ, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.

మంత్రి పొన్నం ప్రత్యేక చొరవ

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రవాణాశాఖ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించడంలో చొరవ చూపలేదనే విమర్శలు ఉన్నాయి. ఏళ్ల తరబడి డీటీసీ, ఆర్టీఓ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదు. పలుమార్లు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినా.. ప్రమోషన్లపై సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. అయితే రవాణాశాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఒకవైపు రవాణాశాఖ పటిష్టతకు, మరోవైపు ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ప్రమోషన్లపై దృష్టిసారించారు. అంతేగాకుండా ఈ నెల 17న సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలోనూ రవాణా శాఖ ప్రమోషన్లకు సంబంధించి అన్ని క్లియర్ చేస్తామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారులు ప్రమోషన్లపై కసరత్తు చేయడంతో పాటు డీపీసీ ఆమోదం సైతం తెలిపింది. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

డీటీసీల ఖాళీలు ఇలా..

రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు గత ప్రభుత్వం డీటీసీలను నియమించింది. ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మాత్రం డీటీసీ పోస్టును శాంక్షన్ ఇవ్వలేదు. ప్రస్తుతం నల్లగొండ, ఆదిలాబాద్, హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో డీటీసీ పోస్టులు ఖాళీగాఉన్నాయి. జేటీసీగా డీటీసీల ప్రమోషన్లతో రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఖాళీ అవుతున్నాయి. దీనికి తోడు వచ్చే ఏడాది వరంగల్ డీటీసీ పోస్టు ఉద్యోగ విరమణతో ఖాళీ అవుతుండటంతో ముందస్తుగానే దాని భర్తీ కోసం ఆర్టీఓకు ప్రమోషన్ కల్పించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఆర్టీఓలకు ఖాళీ అవుతున్న ఉప్పల్, నాగోల్, ఖమ్మం, మెహదీపట్నం, కొత్తగూడెం, సూర్యాపేటకు ఎవరి నియమిస్తారనేది చర్చ హాట్ టాపిక్ గా మారింది. అందుకోసం ఎంవీఐలు ఆశతో ఎదురుచూస్తున్నారు.

కొత్త జిల్లాలకు ఆర్టీఓ శాంక్షన్ పెండింగ్?

ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం, కొత్త జిల్లాలకు ఆర్టీఓ శాంక్షన్ ఇస్తుందా? లేదా? అనేది ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్టీఓ శాంక్షన్ ఇస్తే తమకు అవకాశం ఉందని ఎంవీఐలు ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీఓ వేకెన్సీ ఉంది. కరీంనగర్, మహబూబ్ నగర్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డికి సైతం ఆర్టీఓశాంక్షన్ ఇవ్వలేదు. భూపాలపల్లి కొత్త జిల్లాకు సైతం ఆర్టీఓ శాంక్షన్ ఇవ్వలేదు. అదే విధంగా జగిత్యాల, జనగాం, మహబూబాబాద్, మెదక్, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్లా, వనపర్తి, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లా, ములుగు, నారాయణపేట జిల్లాలకు గత ప్రభుత్వం ఆర్టీఓ పోస్టులు మంజూరు చేయలేదు. జిల్లాలు మాత్రం చేసి అక్కడ ఇన్ చార్జులుగా ఎంవీఐలకు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి జిల్లాల్లో డీటీసీ పోస్టులు ఉన్న దగ్గర ఆర్టీఓ పోస్టులకు శాంక్షన్ ఇవ్వలేదని సమాచారం. అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో కొండాపూర్‌కు సైతం ఆర్టీఓ పోస్టుకు మంజూరీ ఇవ్వలేదు. దీంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు.

Tags:    

Similar News