Seethakka: శ్రీతేజ్ త్వరగా కోలుకొని బయటకు రావాలి

సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను మంగళవారం మంత్రి సీతక్క పరామర్శించారు.

Update: 2024-12-31 17:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను మంగళవారం మంత్రి సీతక్క పరామర్శించారు. శ్రీతేజ్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు. శ్రీతేజ్ తండ్రికి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించడం అత్యంత బాధకరమన్నారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందన్నారు. వెంటిలేటర్ చికిత్స నుంచి శ్రీతేజ్ బయటకు వచ్చాడన్నారు. శ్రీతేజ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.

మహిళా శిశు సంక్షేమశాఖ నుంచి ప్రత్యేక అధికారిని నియమించి శ్రీతేజ్‌కు అందుతున్న చికిత్సను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. డాక్టర్లు స్పెషల్ కేర్ తీసుకుని మెరుగైన చికిత్సను అందించాలని ఆదేశించామన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకుని బయటకు రావాలని కోరుకుంటున్నామన్నారు. శ్రీతేజ్ ప్రాణాలను కాపాడేందుకు ఇటు ప్రభుత్వం.. అటు డాక్టర్లు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకుంటాడన్న ఆశతో ఉన్నామని, నూతన సంవత్సరంలో చిన్నారి శ్రీతేజ్ ఆరోగ్యవంతుడై వస్తాడన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.

Tags:    

Similar News