ప్రభుత్వంపై బురదజల్లడం అర్థరహితం.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్
అంగన్వాడీలపై బురద జల్లడం అర్థరహితమని మంత్రి సీతక్క అన్నారు. ....
దిశ, తెలంగాణ బ్యూరో: అంగన్వాడీలపై బురద జల్లడం అర్థరహితమని మంత్రి సీతక్క అన్నారు. భువనగిరి ముదిరాజ్ వాడ అంగన్వాడి కేంద్రంలో ఆగస్టు 22, 2024న పాడైపోయిన గుడ్లు సరఫరా చేశారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై మంత్రి సీతక్క స్పందించారు. ఆ వార్త తనకు తెలిసిన వెంటనే… అదే రోజు మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన జిల్లా సంక్షేమ అధికారిణి విచారణ చేపట్టి సెక్టార్ సూపర్ వైజర్, టీచర్, హెల్పర్‌తో పాటు కోడిగుడ్ల కాంట్రాక్టరుకు మోమో జారీ చేసినట్టు ఆమె తెలిపారు. పాడైనపోయిన గుడ్డు సరఫరాపై సంజాయిషీ కోరామని, పాడైపోయిన గుడ్డును ఇచ్చినందుకు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవద్దని వివరణ అడిగినట్టు చెప్పారు. కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టును ఎందుకు రద్దు చేయకూడదని కాంట్రాక్టరుకు మోమో జారీ చేశామన్నారు. ఆ మరుసటి రోజు అంటే 23 ఆగస్టు 2024న సెక్టార్ సూపర్ వైజర్ ఆర్. నర్మద, టీచర్ స్వరూపారాణి, హెల్పర్ అరుణలు లిఖిత పూర్వక వివరణ ఇచ్చారని మంత్రి సీతక్క తెలిపారు.
అయితే వారి వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో, బాధ్యులను సస్పెండ్ చేసేందుకు అవసరమైన ప్రక్రియను 24 గంటల్లోపే జిల్లా అధికారులు ప్రారంభించారన్నారు. ఇలాంటి ఘటనలు మరెక్కడా జరక్కుండా అంగన్ వాడీ సెక్టార్ సూపర్ వైజర్లకు కీలక ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రతి నెల సెక్టార్ల వారీగా అంగన్ వాడీ టీచర్లను సమావేశ పరిచి సూచనలు చేసినట్లు గానే..ఇక నుంచి హెల్పర్లకు సైతం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి విధి నిర్వహణపై ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఘటన జరిగిన 24 గంటల్లోపే శాఖ పరమైన విచారణ పూర్తి చేసి, బాధ్యులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధపడగా... అవేవీ పట్టకుండా నాలుగు రోజుల ఆలస్యంగా మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం ఆయన బాధ్యాతారాహిత్యానికి నిదర్శనమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హాయంలో అంగన్ వాడీ కేంద్రాల్లో పాడైపోయిన గుడ్లకు సంబంధించి ఎన్నో ఘటనలు వెలుగు చూసినా..గత ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని మంత్రి గుర్తు చేశారు. అంగన్ వాడీ కేంద్రాలకు ప్రతి రోజు 18 లక్షలకు పైగా గుడ్లు సరఫరా అవుతున్నాయని… ఎక్కడా ఏ చిన్న సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎక్కడ పొరపాట్లు జరిగినా తక్షణం స్పందించి తగు చర్యలు తీసుకున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉదాసీనంగా వ్యవహరించిన సిబ్బందిపై, నాసి రకం గుడ్లు సప్లై చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని మంత్రి మరోసారి హెచ్చరించారు.