Minister Seethakka: వ‌య‌నాడ్ ప్రజ‌ల‌కు మంత్రి సీత‌క్క చేయూత‌.. రూ.20 ల‌క్షల చెక్కు అందజేత

ప‌కృతి విల‌యానికి అత‌లాకుత‌మైన కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రి సీత‌క్క శ‌నివారం ప‌ర్యటించారు.

Update: 2024-08-24 16:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప‌కృతి విల‌యానికి అత‌లాకుత‌మైన కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రి సీత‌క్క శ‌నివారం ప‌ర్యటించారు. ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌తో కలిసి ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మంత్రి సీతక్క, బాధిత కుటుంబాల సహాయార్థం తాను సేకరించిన రూ.20 లక్షల చెక్‌ను స్థానిక ఎమ్మెల్యే టి.సిద్దిఖీకి అందించారు. దీంతో పాటు సుమారు రూ.10 ల‌క్షల విలువ‌గ‌ల దుస్తులు, నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను స్థానిక నాయ‌కులు అంద‌చేశారు. వందల సంఖ్యలో మృతులను సామూహిక ఖననం చేసిన ముండక్కై శ్మశాన వాటికలో మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడే మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చే క్రమంలో మంత్రి సీతక్క తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు.

వ‌య‌నాడ్‌లో జూలై 30న‌ సంభ‌వించిన విపత్తు వంద‌ల‌ మందిని బలిగొన‌గా ఇప్పటి వ‌ర‌కు చాలమంది ఆచూకి ల‌భించలేదు. గుర్తు ప‌ట్టరాని విధంగా మారిన మృత‌దేహాల నుంచి డీఎన్ఏ‌లు సేక‌రించి అక్కడి ప్రభుత్వమే ముండక్కై శ్మశాన వాటికలో సామూహికంగా ఖ‌న‌నం చేసింది. త‌మ ఆప్తుల చివ‌రి చూపున‌కు సైతం నోచుకోని ఎంద‌రో పుట్టెడు దుఖంతో ముండక్కై శ్మశాన వాటికలో త‌మ వారి స‌మాధుల‌ను వెతుక్కుంటున్నారు. త‌న త‌ల్లిని ఇక్కడే ఖ‌న‌నం చేసార‌ని తెలుసుకున్న ఓ యువ‌తి ఆ ప్రాంతానికి చేరుకుని.. చివ‌రిచూపున‌కు కూడా నోచుకోలేక‌పోయాను అంటూ త‌న త‌ల్లి స‌మాధి వ‌ద్ద బోరున విల‌పించింది. ఆ యువ‌తి శోకంతో మంత్రి సీత‌క్క భావోద్వేగానికి లోనయ్యారు.

వయనాడ్‌తో సీతక్కకు ప్రత్యేక అనుబంధం

వ‌యనాడ్‌తో మంత్రి సీత‌క్కకు మంచి అనుబంధం ఉంది. రాహుల్ గాంధీ వాయ‌నాడ్ ఎన్నిక‌ల ప్రచారంలో సీత‌క్క విస్తృతంగా పాల్గొన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన చాలా కార్యక్రమాల‌కు సీత‌క్క హ‌జ‌ర‌య్యారు. అంత‌టి అనుబంధం ఉన్న వయానాడ్ ను ప్రకృతి చిన్నాభిన్నం చేయ‌డంతో సీత‌క్క త‌ట్టుకోలేక‌పోయారు. తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు, అధికార కార్యక్రమాలు, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల వ‌యనాడ్‌కు మంత్రి త‌క్షణం వెల్లలేక‌పోయినా ఎప్పటిక‌ప్పుడు అక్కడి ప్రజ‌ల యోగ‌ క్షేమాల‌ను అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు.

సీత‌క్క ప్రయ‌త్నాల‌ను తెలుసుకున్న ప‌లువురు నాయ‌కులు త‌మ వంతు స‌హ‌కారం ఆందించారు. ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల ఆశోక్, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, టీపీపీసీ ప్రధాన కార్యద‌ర్శి స‌త్తు మ‌ల్లేష్, త‌దిత‌ర నాయ‌కులు ఆర్ధికంగా స‌హ‌క‌రించారు. ములుగు, ఆదిలాబాద్ పార్టీ శ్రేణులు ముందుకొచ్చి చేయుతనిచ్చారు. మంత్రి సీత‌క్క భ‌ద్రత, వ్యక్తిగత సిబ్బంది సైతం త‌మ వంతుగా రూ.50 వేల స‌హాయం చేశారు. వ‌యనాడ్ ప్రజ‌ల కోసం ముందు కొచ్చి నిధులు, వ‌స్తువులు అంద‌చేసిన వారికి, బాల‌ వికాస్ వంటి స్వచ్ఛంద సంస్థలకు మంత్రి సీత‌క్క ధన్యవాదాలు తెలిపారు.


Similar News