ఏపీకి ఇప్పుడు కేసీఆర్ లాంటి నాయకుడు అవసరం: మంత్రి ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-03-15 14:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీ నాయకుల చేతగాని తనం వల్లే ఆరాష్ట్రం అభివృద్ధి జరగలేదని.. ఏపీకి సహజ వనరులు ఉన్నా.. ఆ రాష్ట్ర సీఎంలకు ప్రజల పట్ల శిత్తశుద్ధి లేదని.. అక్కడి నాయకులకు శిత్తశుద్ధి ఉంటే 9 ఏళ్లలో వైజాగ్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసి ఉండేవారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం 19 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న సింగపూర్ అంత అభివృద్ధి జరిగితే.. వందల కిలోమీటర్ల సముద్రం ఉన్న ఏపీ ఎంత అభివృద్ధి జరగాలి అన్నారు. ఏపీకి కేసీఆర్ నాయకత్వం అవసరం ఉందని, ఆ రాష్ట్ర ప్రజల పక్షాన కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏపీలోని కర్నూల్, నంద్యాల, ప్రకాశం జిల్లాలకు చెందిన నేతలు బీఆర్ఎస్‌లో చేరారు.

వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ తరహా అభివృద్ధి ఆంద్రప్రదేశ్‌లో జరగాలని అక్కడి ప్రజలు కోరుకుంటూ కేసీఆర్ నాయకత్వం కావాలనుకుంటున్నారన్నారు. గతంలో ఉన్న నాయకుడు ఒక కులాన్ని పెంచుకున్నాడరని, ఇప్పుడు వచ్చిన నాయకుడు ఆ కులంపై పడ్డాడన్నారు.

8 ఏళ్ల నుంచి రాజధాని ఏర్పాటు చేసుకోకుండా ఇద్దరు సీఎంలు ఏపీకి అన్యాయం చేశారని మండిపడ్డారు. ఏపీలో అభివృద్ధి పక్కన పెట్టి కులాల కొట్లాట జరుగుతుందని మండిపడ్డారు. దేశంలో మోడీని ప్రశ్నించే ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్‌ను ఎదురుకోలేక ఆయన బిడ్డ కవితను కేసులతో ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ మోడల్ దేశానికి అవసరమన్నారు.

ఏపీలో రాజకీయ పార్టీల పరిస్థితి విచిత్రంగా ఉందని, అధికార వైసీపీ- విపక్ష టీడీపీ కూడా మోడీకే మద్దతుగా ఉన్నాయని ఆరోపించారు. దీంతో విశాఖ ఫ్యాక్టరీని కేంద్రం అమ్మినా మోడీని అడిగే పరిస్థితి ఏపీలో లేదన్నారు. ఏపీలో ప్రజల పక్షాన కొట్లాడే పార్టీ, కేసీఆర్ లాంటి నాయకుడు అవసరం ఉందన్నారు. తెలంగాణకు హైదరాబాద్ ఉన్నట్లు- ఏపీకి వైజాగ్ ఉందని స్పష్టం చేశారు.

ఏపీ బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టింది కేసీఆర్ కాదని, కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ ఉమ్మడి ఏపీని విడగొడితే బీజేపీ సహకరించిందని, వైసీపీ, టీడీపీ లేఖలు ఇచ్చాయని మండిపడ్డారు. చేరిన వారిలో కర్నూల్ కార్పొరేటర్ ముస్తాక్, సాయి తేజ్ సర్పంచ్, రామాపురం ప్రకాశం, సలీం బేగ్, వెంకటేశం, మాజీ జడ్పీటీసీ యూసుఫ్ బేగ్. ఎమ్మార్పీఎస్ కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు రాధమ్మ, మాజీ ఎంపీటీసీలు, నాయకులు తదితరులుఉన్నారు.

Tags:    

Similar News