BIG News: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉత్కంఠ.. నేడు మరోసారి విచారణకు శ్రవణ్ రావు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు మరోసారి విచారించనున్నారు.

Update: 2025-04-02 01:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు మరోసారి విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ6 నిందితుడిగా శ్రవణ్ రావుపై కేసు నమోదైంది. నేడు విచారణకు హజరుకావాలని మరోసారి నోటీసులు అందజేశారు. శనివారం జరిగిన విచారణలో సిట్ అధికారులకు శ్రవణ్ రావు ఏ మాత్రం సహకరించలేదని అధికారులు చెబుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్ళేందుకు అనుమతులు తీసుకోనున్నారు. సుప్రీం కోర్టుకు వివరించి శ్రవణ్‌రావుకు ఇచ్చిన మధ్యంతర రక్షణను తొలగించాల్సిందిగా పోలీసులు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణకు సహకరించకుండా శ్రవణ్‌రావు వ్యవహారశైలి ఇదేవిధంగా కొనసాగితే ఆయనను అరెస్టు చేయక తప్పదని సీనియర్‌ పోలీసు అధికారులు తెలుపుతున్నారు. విచారణ సమయంలో గత ప్రభుత్వ పెద్దల నుంచి తనకు వచ్చిన ఆదేశాల మేరకు కొంత సమాచారాన్ని డీఎస్పీ ప్రణీత్‌రావుకు ఇచ్చానని మాత్రమే శ్రవణ్ రావు అంగీకరించారని సమాచారం బహిర్గతం అయింది. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని, కేసు నమోదు అవగానే ఎందుకు దేశం విడిచి పోయారు అనే ప్రశ్నలకు సరైనా సమాధానాలను ఇవ్వలేదని అధికారులు తెలుపుతున్నట్లుగా సమాచారం.

కేసుకు తనకు సంబంధం లేదని బెయిల్ పిటిషన్

శ్రవణ్ రావు విదేశాలలో ఉన్న సమయంలోనే హైకోర్టులో పలుమార్లు ముందుస్తు బెయిల్ కు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రవణ్ రావు తరపు న్యాయవాది బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపిస్తున్న సమయంలో తన పిటిషనర్ కు కేసుతో సంబంధం లేదని పలుమార్లు కోర్టుకు వివరించారు. గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో శ్రవణ్ రావుది కీలక పాత్ర అని, హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని.. ప్రభుత్వ న్యాయవాది తన వాదనలలో వినిపించారు. వాదనలు పరిశీలించిన హైకోర్టు శ్రవణ్ రావు బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది. సుప్రీం కోర్టులో ప్రత్యేక అనుమతితో పోలీస్ విచారణకు హాజరయ్యారు. తాను పిటిషన్ లో పేర్కొన్న విధంగానే పోలీసుల విచారణలో శ్రవణరావు నడుచుకుంటున్నారని తెలుస్తుంది. విచారణలో శ్రవణ్ రావు వెల్లడించే అంశాలపై శ్రవణ్ రావు అరెస్టుపై సంసిగ్ధత నెలకొంది.

సిట్ విచారణకు ప్రభాకర్ రావు హజరవుతారా

సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావును సిట్ అధికారులు అరెస్ట్ చేసేందుకు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో శ్రవణ్ రావు అరెస్టు జరిగితే అమెరికాలో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణకు హజరువుతారా అనే సందేహం నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరయ్యే అంశంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ ను విచారించేదుకు వాయిదా వేస్తున్నట్లు గత విచారణలో హైకోర్టు తెలిపింది. నేడు లేదా రేపు ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే విచారణకు హాజరయ్యేందుకు వస్తారని పేర్కొన్నారు. ప్రభాకర్ రావు 65 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, అనారోగ్య సమస్యలతో మాత్రమే అమెరికా వెళ్లారని, ఎక్కడికి పారిపోలేదని ప్రభాకర్ రావు తరపు అడ్వకేట్ కోర్టుకు వివరించారు. ముందుస్తు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ మేరకు ప్రభాకర్ రావు బెయిల్ మంజూరుపై హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. బెయిల్ మంజూరు కాకపోయిన, శ్రవణ్ రావు అరెస్టు జరిగినా ప్రభాకర్ కచ్చితంగా విచారణకు హాజరువుతారా అనే అంశంపై సిట్ అధికారులు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. రెడ్ కార్నర్ నోటిసులకు ఏమని సమాధానం ఇస్తారనే కూడా ఆసక్తిగా మారింది.

రెడ్ కార్నర్ నోటీసులు అందినట్లు తెలుపుతున్న సీఐడీ

ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు అందినట్లుగా సీఐడీ అధికారులు తెలుపుతున్నారు. అమెరికాలో ఉంటున్నట్లుగా గుర్తించామని సీఐడీ అధికారులు సీబీఐకి సమాచారం అందించి ఇంటర్ పోల్ సమన్వయంతో మార్చి 19వ తేదిన రెడ్ కార్నర్ నోటీసులు అందజేసినట్లుగా తెలుపుతున్నారు. శ్రవణ్ రావుకు నోటీసులు అందజేసినట్లు తెలిపారు. ముందస్తు బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో శ్రవణ్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ సమయంలో కఠిన చర్యలకు పాల్పడకుండా మినహాయింపు ఇస్తే విచారణకు హాజరువుతారని ఆయన తరపు అడ్వకేట్ సుప్రీంకోర్టు విచారణలో తెలిపారు. కోర్టు మినహాయింపుతో విచారణకు హాజరయ్యారు. ప్రభాకర్ విచారణకు హాజరైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల విచారణ పూర్తవుతుంది. ఈ కేసులో 11 మందిని నిందితులుగా చేర్చగా అరెస్టు అయినా వారిలో నలుగురు బెయిల్ మంజూరై జైలు నుంచి విడుదలయ్యారు. వారిలో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, డీఎస్పీ ప్రణీత్ రావు బెయిల్ పై ఉన్నారు. వీరంతా పోలీసు విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశాలిచ్చింది.

Tags:    

Similar News