బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా.. మంత్రి ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Update: 2023-02-24 16:22 GMT

దిశ, ఏర్గట్ల: ఏర్గట్ల మండలంలో శుక్రవారం పలు అభివృద్ది పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలు మంగళ హారతులతో, గ్రామస్థులు డప్పు చప్పుళ్లతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. చిన్నా పెద్దా అందర్నీ పలకరిస్తూ మంత్రి ముందుకు సాగారు. పురాతన దేవాలయం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఏర్గట్ల మండల కేంద్రంలో రూ.38లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనం, సుమారు 16 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం అదనపు గది ప్రారంభోత్సవం, పురాతన లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో రూ.18 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపం ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం తాళ్ల రాంపూర్ గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ (పల్లె ధవాఖాన )ప్రారంభోత్సవం, 20 లక్షల వ్యయంతో నిర్మించే నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ది పనుల పరంపర కొనసాగుతోందని తెలిపారు. ఏర్గట్ల, తాళ్ళరాంపూర్ గ్రామంలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, శంకుస్ధాపన చేసుకున్నామని తెలిపారు. ఎల్లప్పుడూ బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి కంకణబద్దుడనై ఉంటానని మంత్రి స్పష్టం చేశారు. పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసి,గ్రామాల అభివృద్ధికి రూపాయి కూడా తేని వారు ఎవరు..? నిత్యం ప్రజల్లో ఉంటూ గ్రామాల అభివృద్ది కోసం,రైతుల కోసం పనిచేస్తున్న వారు ఎవరో ప్రజలే ఆలోచన చేయాలని కోరారు. ఇవాళ వందల కోట్లతో బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ది చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్లు గుల్లె లావణ్య గంగాధర్, భీమనాతి భాను ప్రసాద్, ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, జెడ్పిటిసి గుల్లే రాజేశ్వర్, ఎంపిటిసి జక్కని మధు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజపూర్ణానందం, సహకార సంఘం చైర్మన్ బర్మ చిన్న నర్సయ్య, వైస్ చైర్మన్ సింగసారం గంగారం, గ్రామ కమిటీ అధ్యక్షులు బద్దం ప్రభాకర్ రెడ్డి, మండల వైద్యాధికారిని లక్ష్మీ ప్రసన్న ప్రియ, ఆరోగ్య సహాయకులు పండరి, శ్రీనివాస్, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News