ప్రధాని మోడీ ముఖంలో భయం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోడీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన
దిశ, వెబ్డెస్క్: ప్రధాని మోడీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్బన్ టెర్రరిజంపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర విభజన చట్టం హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. ఎన్నికల వేళ ప్రజల మధ్య విద్వేషాలు పెంచేలా మోడీ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ ఏం మాట్లాడిన ఆయన ముఖంలో భయం కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. మోడీ మాటలు ప్రధాన మంత్రి పదవి స్థాయిని దిగజారుస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
ఎన్నికల సందర్భంగా బీజేపీ ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన ఎల్కే అద్వానీకి నమస్కారం చేయలేని మోడీకి.. పీవీ నర్సింహారావు గురించి మాట్లాడే అర్హత లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో కాంగ్రస్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పని చేస్తోందని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు గెలిపించాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు.