ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలి : మంత్రి పొన్నం

రవాణా శాఖలో లక్ష్యానికి అనుగుణంగా ఆదాయ మార్గాలను పెంచేందుకు ఎన్ఫోర్స్మెంట్ పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

Update: 2024-09-25 15:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రవాణా శాఖలో లక్ష్యానికి అనుగుణంగా ఆదాయ మార్గాలను పెంచేందుకు ఎన్ఫోర్స్మెంట్ పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం రవాణా శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ జనరేట్ కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఆటోలలో విద్యార్థులను తీసుకొని ఓవర్ లోడ్ తో తీసుకెళ్తున్న వారి పై అధికారులు తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

ప్రభుత్వ , ప్రైవేట్ స్కూల్స్ , కాలేజీల్లో ప్రతి విద్యార్థికి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజ్ భవన్ స్కూల్ లో రోడ్ సేఫ్టీ కార్యక్రమం కోసం ఇప్పటికే 5 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. స్కూల్, కాలేజీ విద్యార్థులకు రోడ్డు సేఫ్టీ పై ఆధునిక సాంకేతిక పద్ధతిలో ఉండేలా వారికి కరికులం ఉండాలన్నారు. ప్రతి ఏడాది దేశంలో రోడ్డు ప్రమాదాల్లో లక్షా 60 వేల మంది మరణిస్తుండగా తెలంగాణలో ప్రతి రోజూ 20 మంది మృతి చెందుతున్నారన్నారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి పై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. మోటార్ వాహన చట్టం ప్రకారం వారి లైసెన్స్ లు రద్దు చేయాలని సూచించారు. ఇసుక, ఫ్లై యాష్ ల ఓవర్ లోడింగ్ పై వేయింగ్ మిషన్ లతో చెక్ చేయాలన్నారు.

వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న స్క్రాప్ పాలసీ, ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ఇతర రవాణా పాలసీలను అధ్యయనం చేసిన అధికారులు సమగ్ర నివేదికను అందజేశారు. మరోసారి తుది నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. రవాణా శాఖ కార్యాలయాలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న వాటి లిస్ట్ తీసి ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కలెక్టర్లకు ప్రభుత్వ స్థలాల కోసం లెటర్స్ పెట్టాలని సూచించారు. ఫీల్డ్ లో ఉపయోగకరంగా ఉండేందుకు రవాణా శాఖ అధికారులకు టాబ్స్ ఇవ్వడంతో పాటు వారి ఫీల్డ్ విజిట్ చేయడానికి వాహన సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. రేషన్లైజడ్ ప్రాసెస్ లో రెవెన్యూ టార్గెట్స్ ను పెంచాలని, నిబంధనలు పాటిస్తున్న ప్రయాణికులను ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబరితి, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు రమేష్ , మమత, అధికారులు పాల్గొన్నారు.


Similar News