పాడికౌశిక్ రెడ్డి, జోగినపల్లి సంతోష్, నమస్తే తెలంగాణకు మంత్రి పొన్నం లీగల్ నోటీసులు

తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని మంత్రి పొన్నం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, టీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ జోగినపల్లి సంతోష్ కుమార్‌లకు లీగల్ నోటీసులు పంపారు.

Update: 2024-06-23 04:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని మంత్రి పొన్నం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, టీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ జోగినపల్లి సంతోష్ కుమార్‌లకు లీగల్ నోటీసులు పంపారు. ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, టీ న్యూస్ ఛానెల్ , టీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ జోగినపల్లి సంతోష్ కుమార్, నమస్తే తెలంగాణ దినపత్రిక, పార్టీ చీఫ్ ఎడిటర్ తిగుళ్ళ కృష్ణమూర్తి , తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లకి లీగల్ నోటీసులను పొన్నం తరఫు అడ్వకేట్ ఈటోరు పూర్ణచందర్ రావు పంపారు.

ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీ నుండి ఉత్పత్తి అవుతుందని.. అది వినియోగించుకోవడానికి వీలుండదని నోటీసుల్లో తెలిపారు. దీనిని టెండర్ల ప్రక్రియ ద్వారా ఉచితంగా సప్లై చేస్తారన్నారు. ఈ ఫ్లై యాష్‌ను రోడ్ల నిర్మాణానికి, బ్రిక్స్ తయారీకి ఉపయోగిస్తారన్నారు. ఈ ఫ్లై యాష్ రామగుండం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్తుందన్నారు. ఈ లారీలలో ఎంత ఫ్లై యష్ పోతుంది, ఎంత అన్లోడ్ అవుతుందనేది ఎన్టీపీసీ మాత్రమే చూసుకుంటుందని పేర్కొన్నారు. ఫ్లై యాష్ ఎక్కడ లోడింగ్ అవుతుందో అక్కడ అడగల్సింది పోయి హుజురాబాద్‌లో కౌశిక్ లారీలను ఆపి మంత్రి‌ పొన్నంపై ఆరోపణలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆ లారీల్లో ఓవర్ లోడ్ తో వెళ్తుందని ప్రతి లారీకి డబ్బులు తీసుకుంటూ పంపిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ పరువుకు భంగం కలిగేలా నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.

ఫ్లై యాష్ అనేది రోజుకు వేల మెట్రిక్ టన్నులు వెళ్తుంటాయని.. అది అధికారులు, ఎన్టీపీసీ చూసుకుంటారన్నారు. అది టెండర్ ద్వారా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు చూసుకుంటారని తెలిపారు. కానీ వ్యక్తిగత కక్షతో రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఆరోపణలు చేశారని అడ్వకేట్ పూర్ణచందర్ రావు తెలిపారు. అలాగే మంత్రిపై ఆరోపణలను ప్రసారం చేసిన టీ న్యూస్ ఛానెల్‌తో పాటు నమస్తే తెలంగాణ దిన పత్రికకు కూడా ఈ లీగల్ నోటిసులు పంపించినట్లు పేర్కొన్నారు. 


Similar News