Rythu Bharosa: ఐటీ రిటర్న్స్ రైతులకూ భరోసా.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రైతుభరోసాపై బీఆర్ఎస్ దొంగ ప్రచారం చేస్తున్నదని మంత్రి పొంగులేటి ఫైర్ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఇన్ కమ్ ట్యాక్స్ కట్టే వారికి రైతు భరోసా రాదని గత ప్రభుత్వంలోని పెద్దలు దొంగ ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటువంటి ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. రైతులు తమ పిల్లల చదువుల నిమిత్తం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారని అంత మాత్రాన అలాంటి రైతులకు రైతు భరోసా ఇవ్వకూడదనే ఆలోచన లేదని తెలిపారు. రైతుభరోసా విధివిధానలపై ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇందులో భాగంగా మాట్లాడిన పొంగులేటి.. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ ఓ పేక మేడ అని త్వరలోనే అది కూలిపోవడం ఖాయం అన్నారు. ప్రజలు రెండు సార్లు కర్రుకాల్చి వాత పెట్టినా వారికి బుద్ధిరాలేదన్నారు. రైతుభరోసా కోసం ఉంచిన డబ్బులను రైతురుణమాఫీకి ఈ ప్రభుత్వం ఉపయోగిస్తున్నదని ఓ పెద్ద మనిషి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అసలు ఆయనకు రైతు భరోసాకు రైతు రుణమాఫీకి తేడా తెలుసా అని ప్రశ్నించారు. వ్యవసాయం అంటేనే తెలియని మీకు, రైతుల కష్టం అంటే ఏంటో తెలియని మీకు ఈ పేదోడి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమంగురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. గత ప్రభుత్వం ఏతులకు పోయి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని కేంద్రం నుంచి నిధులను కూడా తీసుకురాలేని దౌర్భాగ్య రీతిలో వ్యవహరించిందని మండిపడ్డారు. రైతుభరోసా విషయంలో గత ప్రభుత్వం మాదిరిగా తాము గొప్పలకు పోవడం లేదన్నారు. దేశచరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయనట్లుగా రైతురుణమాఫీ చేస్తుంటే తెల్ల రేషన్ కార్డు లేకుంటే రుణమాఫీ చేయరని కొంత మంది వంకర కూతలు కూస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రధాన ప్రతిపక్షం అని మీరు చెప్పుకుంటున్నారు. భవిష్యత్ లో ఆ పదవి కూడా ఉంటుందో లేదో ఒక్కసారి పరిశీలించుకోవాలన్నారు. ప్రజలు ఏది చెబితే అది చెసేందుకు ఈ ప్రభుత్వం చేస్తుందని నాలుగు గోడల మధ్య నిర్ణయాలు ఈ ప్రభుత్వం చేయదన్నారు. అన్ని ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు ఉన్న ఇచ్చిన ప్రతిహామీని నెరవేరుస్తుందన్నారు.