కాళేశ్వరం ప్రాజెక్ట్ రూపశిల్పి సభకు ఎందకు రావట్లే..? కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి సెటైర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఇరిగేషన్ శ్వేతపత్రంపై అసెంబ్లీలో
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఇరిగేషన్ శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను తొందరగా కట్టాలన్న ఆతృత తప్ప.. ప్రాజెక్టుల నాణ్యత గురించి అసలు పట్టించుకోలేదని విమర్శించారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని.. అందుకే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం జరిగిందని గుర్తు చేశారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు నీళ్ల విషయంలో అన్యాయం జరిగిందన్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు తానే రూపశిల్పి అని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారు.. అలాంటి భారీ ప్రాజెక్టుల రూపశిల్పి ఇరిగేషన్‌పై చర్చ సందర్భంగా ఇప్పుడు సభకు వచ్చి ఎందుకు వివరణ ఇవ్వడం లేదని నిలదీశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని మొన్నటి వరకు కేసీఆర్ దేవాలయం అన్నారు.. ఇటీవల మేము మేడిగడ్డ పర్యటనకు వెళ్తే బొందలగడ్డకు వెళ్లారా అని నల్లగొండ సభలో అన్నారని గుర్తు చేశారు. దేవాలయం అన్న మేడిగడ్డ అప్పుడే ఎందుకు బొందల గడ్డ అయ్యిందో చెప్పాలని పొంగులేటి ప్రశ్నించారు. ఇప్పటికీ మేడిగడ్డ బ్యారేజీలో నీటిని ఎత్తిపోయచ్చన్న కేసీఆర్ వ్యాఖ్యలకు ఈ సందర్భంగా మంత్రి కౌంటర్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కుంగిందని.. ఆ బ్యారేజీ డ్యామేజీ అయిన తర్వాత కూడా కేసీఆర్ 45 రోజులుగా సీఎంగా ఉన్నారని, మరీ అప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్‌లోని నీటిని ఎత్తిపోయకుండా ఎందుకు వృథాగా వదిలారని నిలదీశారు. ప్రత్యక్షంగా కంటికి కనిపిస్తోన్న దృశ్యాలను కూడా బీఆర్ఎస్ అంగీకరించడం లేదని ఫైర్ అయ్యారు.