వివాదాల మల్లన్న.. మంత్రి చుట్టూ వైఫైలా కంట్రవర్సీలు

రాష్ట్రంలో ఏ ఇన్సెడెంట్ జరిగినా మంత్రి మల్లారెడ్డి పేరు తప్పకుండా వినిపిస్తుంది. అది రాజకీయాలైన, వ్యాపారాలైన, భూకబ్జాలైన, విపక్షాల విమర్శలైన, ఆఫీసర్లపై దాడులు జరిగినా ఆయన పేరు ప్రస్తావన లేకుండా ఉండదు

Update: 2022-11-22 23:15 GMT

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఏ ఇన్సెడెంట్ జరిగినా మంత్రి మల్లారెడ్డి పేరు తప్పకుండా వినిపిస్తుంది. అది రాజకీయాలైన, వ్యాపారాలైన, భూకబ్జాలైన, విపక్షాల విమర్శలైన, ఆఫీసర్లపై దాడులు జరిగినా ఆయన పేరు ప్రస్తావన లేకుండా ఉండదు. తాజాగా ఐటీ సోదాల్లో కూడా ఆయన పేరు చేరింది. మల్లారెడ్డి టీఆర్ఎస్ లోకి అడుగు పెట్టినప్పట్నించి ఆయన చుట్టూ వివాదాలు కొనసాగుతునే ఉన్నాయి. దీంతో కొన్ని సార్లు ప్రగతిభవన్ వర్గాలు ఇబ్బందులు పడటంతో ఆయనకు గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నట్టు టాక్ ఉంది. మల్లారెడ్డి పొలిటిక్ ఎంట్రీ అనుహ్యంగా జరిగింది. 2014 ఎన్నికల్లో మంచి ఆర్థిక వనరులు ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు చేసిన అన్వేషణలో మల్లారెడ్డి చిక్కినట్టు ప్రచారం ఉంది. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ టికెట్ తో మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ సెగ్మంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కేబినెట్ లో బెర్త్ సంపాదించుకున్నారు.

భూ కబ్జా కేసుల్లో మల్లారెడ్డి

మేడ్చల్ పరిసరాల్లో అనేక భూ కబ్జా కేసుల్లో మల్లారెడ్డి ఉన్నారు. మల్లారెడ్డి విద్యాసంస్థకు పక్కనే ఉన్న తన భూమిని కబ్జా చేశారని ఓ మహిళ హైకోర్టుకు వెళ్లింది. కోర్టు ఆదేశాలతో లోకల్ పోలీసులు ఆయనపై కబ్జా కేసు నమోదు చేశారు. ఆ వివాదం కొనసాగుతుండగానే మే 19, 2022లో ఆయన బామర్ది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శ్రీనివాస్ రెడ్డి భూ వివాదంలో చిక్కుకున్నారు. జవహార్ నగర్ మున్సిపాల్టీ పరిధిలో జరుగుతోన్న ప్రభుత్వ భూముల కబ్జాల వెనుక మల్లారెడ్డి హస్తం ఉన్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఆయన ప్రొత్సహంతోనే లోకల్ లీడర్లు ఇష్టానుసారంగా వెంచర్లు వేస్తునట్టు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. దీంతో ఆ కబ్జాలను ఆపేందుకు మున్సిపల్ కమిషనర్ మంగమ్మ తీవ్రంగా ప్రయత్నించింది. ఆమెను చంపేస్తామని మంత్రి అనుచరులు బెదిరించడంతో ఆమె అక్కడ్నించి బదిలీ చేయించుకుని, తన పూర్వశ్రమమైన సెక్రటేరియట్ లో జాయిన్ అయింది.

ఉత్తగానే మంత్రి పదవి రాలే..

మల్లారెడ్డి పార్టీలోకి వచ్చిరాగానే మంత్రి పదవి దక్కడం పై రకరకాల కథనాలు వినిపిస్తుంటాయి. భారీ స్థాయిలో పైరవీ చేస్తేనే మల్లారెడ్డికి మంత్రి పోస్టు వచ్చిందని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. మల్లారెడ్డి కూడా అంతర్గత సమావేశాల్లో ''నాకు ఉత్తగానే మంత్రి పదవి ఇవ్వలేదు. అందుకు తగ్గది ముట్టచెప్పిన. నన్ను ఎవరు కదలించలేరు''అని చెప్తుంటారని ప్రచారం ఉంది.

జిల్లా లీడర్లతో సఖ్యత కరువు

మేడ్చల్ పరిధిలోని టీఆర్ఎస్ లీడర్లతో మంత్రి మల్లారెడ్డితో విబేధాలు ఉన్నాయి. కుత్బూల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో మొదట్లో స్నేహంగానే ఉండేవారని, కానీ వారితో కూడా కొన్ని విషయాల్లో విభేదాలు వచ్చినట్టు ప్రచారంలో ఉంది. మేడ్చల్ అసెంబ్లీ సెగ్మంట్ పరిధిలోని లోకల్ లీడర్లతో ఎప్పుడు గొడవలు పడుతుంటారనే టాక్ ఉంది. వారిపై పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తునట్టు ఫిర్యాదులు రావడంతో ప్రగతిభవన్ కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలిసింది.

మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల అమ్మకాలు

ఏడాదిన్నర క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మల్లారెడ్డి తీరు పెద్ద దుమారాన్ని రేపింది. ఆయన అసెంబ్లీ సెగ్మంట్ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీ ఎన్నికల్లో పార్టీ టికెట్లు అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. డబ్బులు ఇస్తేనే టికెట్ ఇస్తానని మంత్రి పేచి పెట్టినట్టు ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వెంచర్ వేస్తే కమిషన్ ఏది?

ఆయన నియోజకవర్గంలో ఎవరు వెంచర్ వేసిన లోకల్ ఎమ్మెల్యే, మంత్రికి పర్సెంటేజ్ ఇవ్వాలని స్వయంగా మల్లారెడ్డి మాట్లాడిన ఆడియో అప్పట్లో చక్కర్లు కొట్టింది. 2021 ఏప్రిల్6న మల్లారెడ్డి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మల్లారెడ్డి నేరుగా రియల్టర్ కు ఫోన్ చేసి వాటా ఏమైందని బెదిరించారు. డబ్బులు ఇవ్వకపోతే కలెక్టర్‌కు చెప్పి వెంచర్ పనులు ఆపిస్తామని హెచ్చరించారు.

రేవంత్ వివాదంలో చివాట్లు

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మల్లారెడ్డి సవాలు విసిరి వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి మల్లారెడ్డి కబ్జాలు చేస్తున్నారని రేవంత్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చేందుకు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ దమ్ముంటే తనపై పోటీ చెయ్యాలని తొడగొట్టి రేవంత్ కు సవాల్ విసిరారు. ఆ టైమ్ లో ఆయన మాట్లాడిన భాష, వ్యవహరించిన తీరు పార్టీకి చెడ్డపేరు వచ్చిందని అభిప్రాయంలో ప్రగతిభవన్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు రేవంత్ రెడ్డి బిడ్డ పెండ్లికి తను డబ్బు సాయం చేశానని మల్లారెడ్డి ప్రకటించారు. దీనిపై కూడా ప్రగతిభవన్ వర్గాలు సీరియస్ గా కౌన్సిలింగ్ ఇస్తూ "ఏ తప్పు చెయ్యకపోతే రేవంత్ బిడ్డ పెండ్లికి ఎందుకు సాయం చేస్తావ్'' అని మందలించినట్టు తెలిసింది. ఈ ఏడాది మే 29న ఘట్కేసర్ లో జరిగిన రెడ్ల సింహగర్జనకు మల్లారెడ్డి వెళ్తే ఆయన కాన్వాయిపై చెప్పులు, కుర్చీలు విసిరారు.

హరితాహరం చెట్ల నరికివేత

శామీర్ పేట్ సమీపంలో హైవేపై మల్లారెడ్డి ఓ హోటల్ నిర్మించారు. ఆ హోటల్‌కు అడ్డుగా చెట్లు అడ్డువస్తున్నాయని సుమారు 20 చెట్లను ఆయన నరికివేశారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో లోకల్ ఫారెస్ట్ ఆఫీసర్లు ఆయన సంస్థలో పనిచేసే సిబ్బందికి ఫైన్ వేశారు. కాని మంత్రిని మాత్రం ఏం అనలేదని టాక్ ఇప్పటికీ ఉంది.

మునుగోడు బై ఎలక్షన్ లో మందు పార్టీ

ఈ మధ్య జరిగిన మునుగోడు బై ఎలక్షన్ లో కూడా మల్లారెడ్డి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. చౌటుప్పల్ లోని కొన్ని వార్డులకు ఆయన ఇంచార్జీగా నియమించారు. ఉదయం ప్రచారం చేసిన మంత్రి.. సాయంత్రం లోకల్ వ్యక్తులకు మందు పార్టీ ఇచ్చారు. స్వయంగా ఆయనే అందరికి గ్లాసుల్లో మందు పోయడం పెద్ద దుమారమే రేగింది. ఎన్నికల ప్రచార ఖర్చులకు డబ్బులు కావాలని పక్కనే ఉన్న ఫ్యాక్టరీ మేనేజ్మెంట్లను డబ్బులు డిమాండ్ చేసినట్టు ఫిర్యాదులు ప్రగతిభవన్ కు చేరినట్టు ప్రచారంలో ఉంది.

చీకోటి వ్యవహారంలో పాత్ర

కాసినో ఎపిసోడ్‌లో చీకోటి ప్రవీణ్ ను అరెస్ట్ చేసినప్పుడు కూడా మల్లారెడ్డి పేరు బయటికి వచ్చింది. చీకోటి ప్రవీణ్ కు సన్నిహితంగా ఉండే మాధవరెడ్డి వాడుతున్న వెహికల్ పై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. ఆ స్టిక్కర్ మల్లారెడ్డిదని తేలింది. పాత స్టిక్కర్ ను పడేస్తే, దాన్ని ఎవరో తమ వెహికల్స్ పెట్టుకుంటే తనకు ఏం సంబంధమని మల్లారెడ్డి వివరణ ఇచ్చారు.

పైకి కామెడీ.. లోన మాత్రం చాలా కటువు

మల్లారెడ్డి పైకి మాత్రం కామెడీగా కనిపిస్తాడు. తన మాటలతో అందర్ని నవ్విస్తుంటాడు. కానీ ఆయనలో చాలా మందికి తెలియని మరో కోణం ఉంటుందని లీడర్లు చెప్తుంటారు. ఆయన చేసే ప్రతి పని వెనుక ఆర్థిక కోణం ఉంటుందంటారు. పైసా, పైసాకు లెక్కలు వేస్తారని టాక్ ఉంది. తన విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థులకు ఫీజు తగ్గించమని ప్రగతిభవన్ వర్గాలు కోరినా లెక్క చెయ్యడని ప్రచారం ఉంది.

Tags:    

Similar News