వివాదాస్పద ఫైల్‌పై మంత్రి మల్లారెడ్డి సంతకం.. కేటీఆర్ సీరియస్!
ఎప్పుడూ ఎదుటి వారితో సరదాగా ఉండే మంత్రి మల్లారెడ్డి.. ఓ విషయంలో మంత్రి కేటీఆర్‌కు కోపం తెప్పించినట్టు సమాచారం.
దిశ, తెలంగాణ బ్యూరో: ఎప్పుడూ ఎదుటి వారితో సరదాగా ఉండే మంత్రి మల్లారెడ్డి.. ఓ విషయంలో మంత్రి కేటీఆర్‌కు కోపం తెప్పించినట్టు సమాచారం. మల్లన్న వ్యవహారంపై మంత్రి కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా నామినేటెడ్ పదవులు విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై మల్లారెడ్డి నుంచి వివరణ తీసుకోవాలని నిర్ణయించుకున్న కేటీఆర్ ఆయనకు ఫోన్ చేశారని, నామినేటెడ్ పదవుల విషయంలో వివాదం రాకుండా చూసుకోవాలని సూచించారని తెలిసింది. అందరినీ కలుపుకుని వెళ్లాలని సూచించారని సమాచారం. దీంతో మల్లారెడ్డి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలిసింది.
ఆ తర్వాత ఈనెల రెండోవారంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కేటీఆర్ పక్కనే మల్లారెడ్డి కూర్చున్నారు. సీఎం కేసీఆర్ ఇంకా కేబినెట్ మీటింగ్ జరిగే హాల్లోకి రాలేదు. ఈ టైంలో వీరిద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. అదే సమయంలో కేటీఆర్ జిల్లా రాజకీయాల గురించి మల్లారెడ్డి వద్ద ప్రస్తావించారు. 'మల్లన్న ఎందుకు ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నావ్. అందరినీ కలుపుకుని వెళ్లు. నామినేటెడ్ పోస్టులు ఇచ్చేముందు వాళ్లతో కూడా మాట్లాడు.' అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇందుకు మంత్రి మల్లారెడ్డి సమాధానమిస్తూ.. 'అన్నా.. నేను ఎమ్మెల్యేల అందరితో మాట్లాడిన. అందరూ ఒకే అన్నరు.' అని వివరణ ఇచ్చారు. దీంతో అంతా సర్దుకున్నదని కేటీఆర్ భావించారు. కానీ వెంటనే మల్లారెడ్డి తన పీఎస్‌ను పిలిచి ఓ ఫైల్‌ను తెప్పించుకున్నారు. కేటీఆర్ చూస్తుండగానే దానిపై సంతకం చేశారు. ఐదుగురు ఎమ్మెల్యేలు అభ్యంతరం చెప్పిన వ్యక్తికే పదవి ఇస్తూ మల్లారెడ్డి రికమెండ్ చేసిన ఫైల్ అది. ఈ విషయాన్ని గుర్తించిన కేటీఆర్ షాక్ అయినట్టు పార్టీ వర్గాల సమాచారం.
ప్రగతిభవన్‌లోకి నో ఎంట్రీ?
మేడ్చల్ జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మల్లారెడ్డికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టి, ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై మల్లారెడ్డి స్పందిస్తూ 'నామినేటెడ్ పదవులు ఇచ్చే ముందు అధిష్టానంతో సంప్రదించే నిర్ణయం తీసుకున్నా' అని వివరణ ఇచ్చారు. దీంతో కేటీఆర్ మరింత ఆగ్రహానికి గురైనట్టు ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. అందుకే ఐదుగురు ఎమ్మెల్యేల అసంతృప్తి మీటింగ్ విషయం తెలిసినా కేటీఆర్ మౌనంగా ఉన్నట్టు సమాచారం. అప్పటి నుంచి మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నా, ఆయనకు కేటీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని తెలిసింది. ప్రగతిభవన్‌కు వచ్చి కలుస్తానని మల్లారెడ్డి ఎన్నిసార్లు మెసెజ్ పెట్టినా కేటీఆర్‌కు స్పందించడం లేదని సమాచారం. చివరికి మల్లారెడ్డి నుంచి వచ్చే ఫోన్లకు కేటీఆర్ పెషీలోని సిబ్బంది కూడా లిప్ట్ చేయలేని పరిస్థితి నెలకొన్నట్టు సమాచారం. కొన్ని రోజులుగా మల్లారెడ్డి కదలికలపై ప్రగతిభవన్ వర్గాలకు అనుమానం వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గులాబీ పార్టీని వీడేందుకు మల్లారెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఈ మేరకు ఇతర పార్టీ లీడర్లతో ఆయన సంప్రదింపులు జరిపారని నిఘా వర్గాలు రిపోర్టు ఇచ్చినట్టు గులాబీ పార్టీలో చర్చ నడుస్తున్నది. అందుకే మల్లారెడ్డి విషయంలో ప్రగతిభవన్ వర్గాలు దూరంగా ఉంటున్నట్టు టాక్.
మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే?
మంత్రి మల్లారెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక్క సారిగా మీడియా ముందుకు వచ్చి తమ నిరసన గళాన్ని వినిపించారు. ఈ విషయం అధిష్టానానికి తెలియకుండా జరిగే అవకాశాలు లేవనే వార్తలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. ఆ ఎమ్మెల్యేలు మీడియా ముందుకు రావడం వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నారనే ఆరోపణలు సైతం పార్టీ వర్గాల్లో వినిపించాయి. ఈ వ్యవహారంపై అధినేత కేసీఆర్ సైతం ఇప్పటివరకు అటు మంత్రితోగానీ, ఇటు ఎమ్మెల్యేలతోగానీ సమీక్షించలేదు. ఈ వ్యవహారంతో మల్లారెడ్డి, కేటీఆర్ మధ్య సంబంధాలు తూర్పు-పడమరగా మారాయి. ఎన్నికల సంవత్సరంలో ఈ వ్యవహారం ఎలాంటి పరిణామానికి దారితీస్తుందనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
Also Read..
బీజేపీ vs బీఆర్ఎస్.. BL సంతోష్ వ్యాఖ్యలతో మరింత ముదిరిన వివాదం