KTR :సొంత ఎమ్మెల్యేకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించిన కేటీఆర్ (వీడియో)
మంత్రి కేటీఆర్‌కు కోపం వచ్చింది. సొంత పార్టీ ఎమ్మెల్యేను చీదరించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజనులకు పోడుభూముల పట్టాలను పంపిణీ జరిగింది.
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్‌కు కోపం వచ్చింది. సొంత పార్టీ ఎమ్మెల్యేను చీదరించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజనులకు పోడుభూముల పట్టాలను పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ వెనకాల నుండి పరుగున వచ్చి కేటీఆర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. వెంటనే కేటీఆర్ శంకర్ నాయక్ చేయిని తోసివేశారు. దాంతో ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు సాగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే, జిల్లాలో శంకర్ నాయక్ వర్సెస్ ఎంపీ కవిత మధ్య గత కొంత కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. మంత్రి సత్యవతి రాథోడ్ తోనూ శంకర్ నాయక్‌కు విభేదాలు ఉన్నాయనే టాక్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శంకర్ నాయక్ తీరు పార్టీకి డ్యామేజ్ చేస్తోందని అధిష్టానం వద్దకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ క్రమంలో కేటీఆర్ శంకర్ నాయక్ పట్ల ఈ రీతిగా వ్యవహరించారా లేక ఇదంతా యాదృచ్ఛికంగానే జరిగిందా అనేది ఉత్కంఠగా మారింది.