కేంద్రం తీరుపై ఆగ్రహం.. BRS శ్రేణులకు KTR కీలక పిలుపు
రాష్ట్రంలోని ఉపాధి హామీ పనులపైన కేంద్ర దుష్ప్రచారానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఉపాధి హామీ పనులపైన కేంద్ర దుష్ప్రచారానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో రేపు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది మండిపడ్డారు. పంట కల్లాలను కడితే.. కేంద్రానికి ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్నదాతకోసం కల్లాలు నిర్మిస్తే.. మోడీ సర్కారు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నదని ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ దుష్ప్రచారానికి తెరలేపిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అత్యంత ఉపయుక్తంగా ఉండే వ్యవసాయ కల్లాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది, రైతులకు కలుగుతున్న ప్రయోజనాన్ని పట్టించుకోకుండా కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో బీజేపీ ఉందని అసహనం వ్యక్తం చేశారు.
చేపలు ఆరబెట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో నిర్మిస్తున్న కల్లాలకు అభ్యంతరం చెప్పని మోడీ సర్కారు తెలంగాణ రైతులు కట్టుకున్న కల్లాలకు మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తోందని అడిగారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధించాలని తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ తరఫున ఎన్నో ఏండ్ల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని గుర్తుచేశారు. రైతులకు, వ్యవసాయానికి ఎంతో ఉపయుక్తంగా ఉండే తమ సూచనలను కేంద్రం పట్టించుకోకుండా.. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్రలు కొనసాగిస్తోందని అన్నారు. వ్యవసాయ రంగంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలతో వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతి సాధించిందని అన్నారు.
తెలంగాణ రైతుల ప్రగతిని ఓర్వలేకనే కేంద్రం కక్ష కట్టిందని స్పష్టం చేశారు. 'రైతులకు మేం సాయం చెయ్యం.. చెయ్యనీయం' అన్నట్టుగా కేంద్రం తీరు ఉందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ మతిలేని, కుట్రపూరిత చర్యలపై రేపు అన్నీ జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. మరోపైపు పెరిగిన ఎరువులు, పెట్రోల్ ధరలు, ఇతర ఖర్చుల పెరుగుదల వలన వ్యసాయరంగం పంట పెట్టుబడులు పెరుతున్నాయని, కనీసం ఇప్పుడైనా రైతులను అదుకునేందుకు వ్యవసాయంతో ఉపాధి హమీని అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు కట్టుకున్న వ్యవసాయ కల్లాలతో కలుగుతున్న ప్రయోజనాలను పట్టించుకోకుండా తెలంగాణపై గుడ్డి వ్యతిరేకతతో ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని మోడీ ప్రభుత్వం మొండిపట్టు పట్టడం దుర్మార్గం అని కేటీఆర్ మండిపడ్డారు.
Also Read..