Konda Surekha: ఇంత జరుగుతున్నా కేటీఆర్ కనీసం స్పందించలేదు: కొండా సురేఖ

తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై మంత్రి కొండా సురేఖ మరోసారి రియాక్ట్ అయ్యారు.

Update: 2024-10-02 07:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : సోషల్ మీడియాలో తనను కించపరిచేలా ట్రోలింగ్ చేయడం పట్ల మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల అసభ్యకర పోస్టింగ్‌లు వారి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఇవాళ హైదరాబాద్ బాపూఘాట్ వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి ట్రోలింగ్ విషయంలో రఘునందన్‌రావు ప్రెస్‌మీట్ పెట్టి తనకు మద్దతుగా నిలిచారని వారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ విషయంలో హరీశ్‌రావు కూడా స్పందించారన్నారు. అయిన దానికి కాని దానికి ట్వీట్లు చేసే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం వారి పార్టీకి చెందినవారు మహిళలను కించపరుస్తుంటే క్షమించమని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తమ పార్టీ తరఫున ఇది జరిగిందని క్షమాపణలు కోరి భవిష్యత్‌లో ఇటువంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పకపోవడం కేటీఆర్ వ్యక్తిత్వానికి నిదర్శనమని విమర్శించారు. తాను ఐదేళ్లు బీఆర్ఎస్‌లో పని చేశానని తన వ్యక్తిత్వం అందరికీ తెలుసని కొండా సురేఖ చెప్పారు.

అప్పుడు రాద్ధాంతం.. ఇప్పుడు మౌనమా?

అసెంబ్లీలో అక్కలను నమ్ముకోకండి అని ముఖ్యమంత్రి అంటే దాన్ని పెద్ద రాద్ధాంతం చేసిన బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్ బీసీ మహిళనైన తనపై అసభ్యకర పోస్టులు పెడుతుంటే ఎందుకు మాట్లాడటం లేదని మంత్రి ప్రశ్నించారు. తన ఒక్కరిపైనే కాదని గిరిజన మహిళ అయిన మంత్రి సీతక్క, బీసీ మహిళ మేయర్ విజయలక్ష్మిపై కూడా అసభ్యకర పోస్టులు పెట్టారని, మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని కేటీఆర్ చెప్పినట్లుగా ఉందని ఆరోపించారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాజకీయ విలువలు దిగజారిపోయాయని వ్యక్తిత్వం దెబ్బతీసేలా ప్రవర్తించ వద్దన్నారు. కాగా సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తుందని బీఆర్ఎస్సేనని నిన్న కన్నీటి పర్యంతమైన మంత్రి.. ఇవాళ మరోసారి పై విధంగా స్పందించారు.


Similar News