జాతీయ రహదారులకు మహర్దశ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు సూచించారు.

Update: 2024-08-19 16:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం సచివాలయంలో జాతీయ రహదారులపై ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి పలు జాతీయ రహదారుల నిర్మాణాల స్థితిగతులపై ఆరాతీసి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. సమావేశం అనంతరం మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఎన్ హెచ్-65 ని ఆరు లేన్లుగా విస్తరించేందుకు డీపీఆర్ సిద్దం చేసేందుకు కన్సల్టెంట్ల నియామకానికి టెండర్లు పిలిచామని చెప్పారు. ఎన్ హెచ్-65 పై 422.12 కోట్ల రూపాయలతో చేపట్టిన 17 బ్లాక్ స్పాట్ల పనులను నాణ్యత దెబ్బతినకుండా త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. మన్నెగూడ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయి కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టేందుకు అపాయింటెడ్ డేట్ ను ఈ వారంలో ఖరారు చేస్తారని తెలిపారు. పనులు మొదలు పెట్టేందుకు కొన్ని చోట్ల ఇబ్బందిగా మారిన అటవీ అనుమతులు కూడా వచ్చినందున నిర్మాణ ప్రక్రియకు ఏ ఇబ్బంది లేదని ఆయన తెలిపారు. నాగ్ పూర్ – విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయినందున, భూసేకరణను త్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి కావాల్సిన 1941.65 హెక్టార్ల భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యిందని, రోడ్డు నిర్మాణంలో ఇప్పటి వరకు ఇబ్బందిగా మారిన అటవీ భూముల సమస్యకు, మహబూబాబాద్ జిల్లాలో 73.04 హెక్టార్ల భూమిని కేటాయించి పరిష్కారం చూపించామని చెప్పారు. మిగిలిపోయిన అతికొద్ది భూసేకరణ కూడా సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. రైతుల భూములకు మంచి ధరలను ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని... రైతులు అధైర్యపడకుండా భూసేకరణకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖా ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, పీడీ హైదరాబాద్ నాగేశ్వర్ రావు, పీడీ గజ్వేల్ (ఎన్హెచ్) ఏఐ మధుసూధన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Similar News