Minister Komatireddy: "ఓ వైపు ఫ్లోరిన్.. మరోవైపు మూసీ.. వాళ్లకు మానవత్వం లేదు"

మూసీ నదిలో కలిసే వ్యర్థాల కారణంగా నల్గొండ జిల్లా ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు మంత్రి కోమటిరెడ్డి. హరీష్ రావు, కేటీఆర్ నల్గొండకు వచ్చి మూసీ పరివాహక ప్రాంతాలను పరిశీలించాలని ఆయన కోరారు.

Update: 2024-10-01 08:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లాలో గ్రౌండ్ వాటర్ కాలుష్యం ఎక్కువగా ఉందని, ఫలితంగా లక్షలాది మంది ప్రజలు ఇబ్బందు పడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న క్రమంలో.. ఆయన స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి.. హరీష్ రావు, కేటీఆర్ లకు మానవత్వం లేదని, ఉండి ఉంటే మూసీ ప్రక్షాళనకు మద్దతు ఇస్తారన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో మురికి నీరు ఎలా ఉందో చూసేందుకు వారిద్దరూ నల్గొండకు రావాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళనతో నల్గొండ జిల్లా ప్రజలకు విముక్తి కలుగుతుందని తెలిపారు.

ఒక వైపు ఫ్లోరిన్, మరోవైపు మూసీ మురికినీరుతో జిల్లా ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పండే పంటల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందని ప్రియాంక వర్గీస్ స్టడీ రిపోర్ట్ ఇచ్చారని, దానిని చూసైనా జిల్లా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో ఉన్న ఫార్మా ఇండస్ట్రీల నుంచి వచ్చే కెమికల్స్ అన్నీ నల్గొండ జిల్లాలో ఉండే కృష్ణానదిలో కలుస్తున్నాయని, అదంతా కలుషితమైన నీరేనని వివరించారు. గత ప్రభుత్వం మూసీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో రూ.1000 కోట్లు అప్పు చేసిందని, దానిని కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కొనుగోలు చేసి చైర్మన్ ను చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో మూసీ నదిని శుద్ధిచేసి.. మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటితో నింపుతామని, నల్గొండ ప్రజలకు ఇకపై స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తామని తెలిపారు.

అమెరికాలో చదువుకున్న కేటీఆర్ కు అసలు కామన్ సెన్స్ లేదని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి. తమ పోరాట గడ్డ అయిన నల్గొండ అంటే కేటీఆర్ కు ఎందుకంత కక్షో చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీపై ఏమైనా అనుమానాలుంటే కేటీఆర్, హరీష్ రావులు రీసెర్చ్ చేసుకోవాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతానికి వచ్చి.. ఆ కంపుతో రోగాల బారిన పడుతున్న ప్రజల్ని చూశాక ప్రక్షాళనపై మాట్లాడాలన్నారు.


Similar News