Minister Komatireddy: రాజీవ్‌గాంధీపై మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదు: మంత్రి కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై మాట్లాడే కనీస అర్హత కేటీఆర్‌కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-09-16 08:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ (Rajeev Gandhi)పై మాట్లాడే కనీస అర్హత కేటీఆర్‌ (KTR)కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన నల్లగొండ (Nalgonda)లో మీడియాతో మాట్లాడుతూ.. సెక్రటేరియట్ (Secretariat) ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అందులో తప్పేముందని ప్రశ్నించారు. దేశానికి ప్రధానిగా సేవలందించిన ఆ మహా నాయకుడు నేటికీ జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడని పేర్కొన్నారు. ఇండియాలో సాంకేతిక విప్లవానికి బాటలు వేసిన వ్యక్తి రాజీవ్‌గాంధీ అని అన్నారు. అలాంటి వ్యక్తి పట్ల అనుచితంగా మాట్లాడితే ఇక నుంచి ఏ మాత్రం సహించేది లేదని ఫైర్ అయ్యారు. అయినా విగ్రహావిష్కరణ విషయంలో బీఆర్ఎస్ పార్టీని తాము పరిగణలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.

రాబోయే మరో పదేళ్ల పాటు రాష్ట్రంలో తామే అధికారంలో ఉంటామని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమను ఒక్క మాట అంటే అందుకు వారికి రెండు మాటల్లో సమాధానమిస్తామని ధ్వజమెత్తారు. తెలంగాణ రాజకీయాల్లో పరుష భాషను నేర్పింది కేసీఆర్ (KCR) కాదా అని మండిపడ్డారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై మాట్లాడే హక్కును బీఆర్ఎస్ ఏనాడో కోల్పోయిందని ఫైర్ అయ్యారు. అదేవిధంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతల ఎవరో చెప్పాలని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు (Harish Rao), కేటీఆర్‌లను తాము లెక్కలోకి తీసుకోవడం లేదని మంత్రి కోమటి‌రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.    


Similar News