Minister Jupally: సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనం కాళోజీ: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

తెలంగాణ సాహిత్యానికి సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శన‌ం కాళోజీ నారాయణరావు అని మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు.

Update: 2024-09-09 15:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సాహిత్యానికి సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శన‌ం కాళోజీ నారాయణరావు అని మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. తెలంగాణ యాస‌కు, భాష‌కు జీవం పోసి ప్రజా ఉద్యమాల‌కు ఊపిరిలూదిన మ‌హానీయుడు కాళోజీ అన్నారు. కాళోజీ 108వ జయంతి వేడుక‌ల‌ను సోమవారం తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్యాయం ఎక్కడ జరిగినా కాళోజీ గళమెత్తేవారని, అసమానతలు, దోపిడీ, నిరాదరణకు గురవుతున్న వారిలో ఆయన కలం చైతన్యాన్ని నింపిందన్నారు.

స్థానిక భాషకు ప్రాధాన్యతనిచ్చి ఎవరి వాడుక భాషను వారు రాయాలని, ఇతరుల భాషను అనుకరించే బానిస భావన పోవాలని, ఆయన తపించిన తీరుతో ప్రతి ఒక్కరిలో ఆత్మగౌరవం వెల్లుబికుతుందన్నారు. కాళోజీలో ఉన్న ప్రశ్నించే తత్వాన్ని, ధైర్యాన్ని ప్రతీఒక్కరూ అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యద‌ర్శి వాణిప్రసాద్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యద‌ర్శి డా.న‌మోజు బాలాచారి, సాంస్కృతిక శాఖ సంచాల‌కుడు మామిడి హ‌రికృష్ణ, ప్రజావాగ్గేయకారుడు అందెశ్రీ, జీహెచ్ఎంసీ అద‌న‌పు క‌మిష‌న‌ర్ న‌ల్లగుంట్ల యాద‌గిరి రావు, బైసా దేవాదాసు, త‌దిత‌రులు పాల్గొన్నారు.


Similar News