KTR: నేడు ‘చలో ప్రజాభవన్‌’కు రైతుల పిలుపు.. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్

రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ అమలు కాని రైతులందరూ కలిసి తమకు ఎలాంటి షరతులు విధించకుండా రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో గురువారం ‘చలో ప్రజాభవన్‌‌’ (Praja Bhavan)కు పిలునిచ్చారు.

Update: 2024-09-19 02:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ అమలు కాని రైతులందరూ కలిసి తమకు ఎలాంటి షరతులు విధించకుండా రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో గురువారం ‘చలో ప్రజాభవన్‌‌’ (Praja Bhavan)కు పిలునిచ్చారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో రైతులు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయం ఎదుట తమకు రుణమాఫీ చేయాలని నిరసనలు చేపడుతున్నారు. ఇవాళ చలో ప్రజాభవన్‌కు తరలిరావాలంటూ సోషల్‌ మీడియా (Social Media) వేదికగా ఓ యువ రైతు ఇచ్చిన పిలుపు వైరల్‌ (Viral)గా మారింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు నగరంలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా ఆయా జిల్లాల్లో ముందస్తు అరెస్టులు చేశారు.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ప్రభుత్వం తీరుపై ‘X’ (Twitter) వేదికగా సంచలన ట్వీట్ చేశారు. ‘రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని రైతులు చలో ప్రజాభవన్‌కు పిలుపునిచ్చిన పాపానికి రాష్ట్ర వ్యాప్తంగా వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దారుణమైన చర్య. వారు ఏమైనా దొంగలా, ఉగ్రవాదులా. ఇవాళ ఉదయం నుంచి కూడా అనేక చోట్ల అన్నదాతల ఇళ్లకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలి.

పోలీసుల నిర్బంధకాండతో రైతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. అక్రమంగా నిర్బంధించిన రైతులందరినీ వెంటనే పోలీసులు బేషరతుగా విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్. ముఖ్యమంత్రికి రైతులంటే ఇంత భయమెందుకు.. అన్నదాతలపై ఇంతటి నిర్బంధమెందుకు.. అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసినందుకే రైతులు ఆందోళన బాటపట్టారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా తమకు తామే సంఘటితమై మొదలుపెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదు. రైతుల సంఘటిత శక్తి ముందు దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదు. జై కిసాన్, జై తెలంగాణ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 


Similar News