కొత్త బీర్ బ్రాండ్ కంపెనీకి పర్మిషన్‌పై మంత్రి జూపల్లి క్లారిటీ
రాష్ట్రంలో కొత్త బీర్ ఉత్పత్తులపై సోమ్ డిస్టిల్లరీస్ కంపెనీకి నియమ నిబంధనల ప్రకారమే అనుమతులు ఇచ్చినట్లు ఎక్సయిజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్లారిటీ ఇచ్చారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్త బీర్ ఉత్పత్తులపై సోమ్ డిస్టిల్లరీస్ కంపెనీకి నియమ నిబంధనల ప్రకారమే అనుమతులు ఇచ్చినట్లు ఎక్సయిజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్లారిటీ ఇచ్చారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తన దగ్గరకు ఎలాంటి దరఖాస్తులు రాలేదని, సంబంధిత ఫైల్‌పై తన దగ్గర నిర్ణయం జరగలేదని, ప్రొసీజర్ ప్రకారం స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకున్నదని, ఆ అధికారం దానికి ఉన్నదని స్పష్టత ఇచ్చారు. కార్పొరేషన్ రోజువారీ కార్యకలాపాలు మంత్రిగా తన దష్టికి రావని, సోమ్ డిస్టిల్లరీస్‌కు ఉత్పత్తుల సరఫరాకు మాత్రమే అనుమతి లభించిందని వివరణ ఇచ్చారు. కొత్త బ్రాండ్లు, హోల్‌సేల్ మధ్యం సరఫరా తదితరాలు కార్పొరేషన్ పరిధిలోని అంశమని, డిమాండ్-సప్లైకు అనుగుణంగా అక్కడే నిర్ణయాలు జరుగుతాయన్నారు.
దాదాపు 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ కంపెనీ ఐఎంఎఫ్ఎల్ సరఫరాదారుగా ఉన్నదని పేర్కొన్నారు. ప్రస్తుత రాష్ట్ర ఎక్సయిజ పాలసీ ప్రకారమే సోమ్ డిస్టిల్లరీకి మద్యం సరఫరా ప్రాసెస్‌కు కార్పొరేషన్ ఎండీ అనుమతులు ఇచ్చారని తెలిపారు. నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఒక ప్రకటనలో తెలిపారు. గతంలోనూ కొత్త బ్రాండ్లకు అనుమతులు వచ్చాయని, 2020-21 మధ్యలో 50 లిక్కర్, 5 బీర్ బ్రాండ్లకు, 2021-22లో 75 లిక్కర్, 8 బీర్ బ్రాండ్లకు, 2022-23లో 122 లిక్కర్, 11 బీర్ బ్రాండ్లకు, 2023-24లో 41 లిక్కర్, 9 బీర్ బ్రాండ్ల సరఫరాకు వేర్వేరు కంపెనీలకు అనుమతులు వచ్చినట్లు వివరించారు. ఇవన్నీ కార్పొరేషన్ ద్వారానే జరిగాయని, ప్రొసీజర్ ప్రకారమే ఇప్పుడు కూడా అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.