సీట్లో కూర్చున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. తొలి సంతకం దానిపైనే!

సచివాలయంలోని నాల్గవ అంతస్తులోని తన ఛాంబర్ లో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన సీట్లో కూర్చున్నారు.

Update: 2023-04-30 09:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : డాక్టర్. బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని నాల్గవ అంతస్తులోని తన ఛాంబర్ లో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన సీట్లో కూర్చున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 4 జిల్లాలోని 100 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేసే ఫైల్ పై ఆయన సంతకం చేశారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాన దేవాలయాల్లో మిల్లెట్ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చే ఫైల్‌పై సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డపై.. రాజధాని నడిబొడ్డున మరో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించుకుంటున్న మధుర ఘట్టంలో తాను భాగస్వామ్యం కావడం ఎంతో గర్వ కారణంగా వుందన్నారు.

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకను, పరిపాలనా సౌధాన్ని ఠీవిగా, రాజసం ఉట్టిపడేలా నిర్మించారని అభివర్ణించారు. ఈ శుభ సందర్బంగా యావత్ తెలంగాణ ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరిని మంత్రి అభినందించారు. అంతకుముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజ నిర్వచించారు. వేద పండితులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని వేద మంత్రోచ్ఛరణల మధ్య పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

Tags:    

Similar News