అవి కనిపించడం లేదా..? గవర్నర్ వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్

గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బీజేపీ ప్రతినిధిలా మాట్లాడటం బాధాకరం అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Update: 2023-06-28 10:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బీజేపీ ప్రతినిధిలా మాట్లాడటం బాధాకరం అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై గవర్నర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. గవర్నర్ మాటలు దురదృష్టకరం అన్నారు. గవర్నర్ కోడిగుడ్దు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని.. తెలంగాణ వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి సాధించాం. ఈ అభివృద్ధి పనులు గవర్నర్‌కు కనిపించలేవా అని ప్రశ్నించారు.

బుధవారం కోఠిలో హెల్త్ & ఫ్యామిలీ వేల్ఫేర్ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. గవర్నర్ అనవసరంగా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం కట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నప్పటికీ ఈ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని గుర్తు చేశారు.

గవర్నర్‌కు ఇక్కడ రాజకీయమే కనిపిస్తుందని బీజేపీ అధికార ప్రతినిధుల మాదిరిగా మా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తే మేము కూడా రాజకీయంగానే సమాధానం చెబుతామన్నారు. కంటి వెలుగు, నిమ్స్‌లో బెడ్స్ పెంపు, మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గించడంలో రాష్ట్రం అగ్రభాగాన ఉందని నీతి ఆయోగ్ రిపోర్ట్‌లపై గవర్నర్ ఎందుకు ఒక్క ట్వీట్ కూడా చేయలేకపోయారని ధ్వజమెత్తారు.

మంచి మాకు కనబడుదు, వినబడదు, అనే విధంగా గవర్నర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. కాగా ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రిపై ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె కోరారు. ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై డీఎంహెచ్ఓలతో మంత్రి టెలి కాన్ఫెరెన్సు నిర్వహించారు. సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Tags:    

Similar News