190 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు
మెడికల్ కాలేజీల్లో 190 అసిస్టెంట్ ప్రోఫెసర్లకు పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేసి, కౌన్సిలింగ్ నిర్వహించి వెంటనే పోస్టింగ్ లు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు ఆఫీసర్లకు సూచించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: మెడికల్ కాలేజీల్లో 190 అసిస్టెంట్ ప్రోఫెసర్లకు పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేసి, కౌన్సిలింగ్ నిర్వహించి వెంటనే పోస్టింగ్ లు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు ఆఫీసర్లకు సూచించారు. దీంతో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్ లోని 112 డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ సర్జన్ పదోన్నతుల ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. అంతేగాక టీవీవీపీలోని 371 నర్స్ ప్రమోషన్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. ఫార్మసిస్ట్,ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రఫర్స్ సంబంధించిన పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. వైద్యారోగ్యశాఖ లోని అన్ని విభాగాల హెచ్వోడీ బుధవారం మంత్రి రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. డెంగ్యూ పరీక్ష నిర్ధారణ కోసం ఉపయోగించే 32 సింగిల్ డోనార్ ప్లేట్ లెట్స్ మిషన్లను రూ.10 కోట్లతో కొనుగోలు చేసి, అన్ని జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. వీటి ఏర్పాటు వల్ల సకాలంలో రోగనిర్ధారణ వేగవంతం అవుతుందన్నారు. పీఎంపీ, ఆర్ఎంపీ లకు శిక్షణ ఇచ్చే ప్రణాళికను తయారు చేయాలన్నారు. హై కోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. నిమ్స్ నూతన బిల్డింగ్ నిర్మాణం పనులను వేగవంతం చేయాలన్నారు.కొత్తగా సమకూర్చుకున్న 228 అమ్మఒడి వాహనాలు,(204) 108 వాహనాలు, 34 హర్సే వాహనాలను ఆగస్టు 1 వ తేదీన ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.ఎన్ హెచ్ ఎం పరిధిలోని ప్రతి ఆరోగ్య కార్యక్రమ పై సంబంధిత అధికారులు నిత్యం సమీక్షలు చేయాలన్నారు.
వారంలో కనీసం రెండు రోజులు క్షేత్ర స్థాయి వెళ్లి ప్రజలకు అందుతున్న సేవలపై పరిశీలన చేయాలన్నారు. బస్తీ దవాఖానల ద్వారా పట్టణ పేద ప్రజలకు అందించే సేవల్లో ఎలాంటి లోపం ఉండొద్దు అన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్ ద్వారా 134 రకాల పరీక్షలు ప్రారంభించామని, ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, ఆర్ అండ్ బి ఇఎన్సి గణపతి రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, డిఎంఇ రమేష్ రెడ్డి, టిఎస్ఎంఎస్ఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్ర శేఖర్ రెడ్డి, టివివిపి కమిషనర్ అజయ్ కుమార్, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఛైర్మెన్ రాజలింగం, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.