వ్యూహం మార్చిన BRS.. గవర్నర్ స్పీచ్‌లో అలా.. మంత్రి స్పీచ్‌లో ఇలా!
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ వైఖరి చర్చనీయాంశంగా మారింది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ వైఖరి చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ స్పీచ్ ఒకలా.. ఆర్థిక మంత్రి స్పీచ్ మరొలా కొనసాగడంపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా కేంద్రంపై ఎలాంటి విమర్శలకు తావులేకుండా గవర్నర్ స్పీచ్ తయారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అదే ఆర్థిక శాఖ మంత్రి స్పీచ్‌లో మాత్రం కేంద్రంపై నిప్పులు చెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని గురించి గవర్నర్ తన ప్రసంగంలో వినిపించారు. కేంద్రం సహకారం ఇవ్వడం లేదని గానీ నిధుల కేటాయింపుల్లో అన్యాయం గురించి గానీ ఎలాంటి ప్రస్తావన గవర్నర్ స్పీచ్‌లో లేదు. కానీ సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాత్రం గవర్నర్ స్పీచ్‌కు భిన్నంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఓ వైపు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంటే కేంద్ర ప్రభుత్వం అడ్డంకుల మీద అడ్డంకులు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు.
ఎఫ్ఆర్‌బీఎం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రూ. 15,033 కోట్ల కోత పెట్టిందని ఈ నిర్ణయం పూర్తిగా అసంబద్దమైనదని ఫైర్ అయ్యారు. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ఆర్థిక సంఘం చేసే సిఫారసులను యథాతధంగా అమలు పరిచే సంప్రదాయానికి రాష్ట్ర ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని అన్నారు. కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేస్తోందని దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఈ విధంగా ఆర్థిక సంఘం సిఫార్సులను బేఖాతరు చేసిన సందర్భాలు లేవన్నారు.
విభజన చట్టం హామీ ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉండగా మూడేళ్లకు సంబంధించి 1350 కోట్లు ఇవ్వనేలేదని ఆరోపించారు. మిషన్ భగీరథకు 19205 కోట్లు, మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సులను తుంగలోతొక్కిందని ధ్వజమెత్తారు. ఇంకా పలు హామీలను, రాష్ట్రానికి రావాల్సిన వాటాలను కేంద్రం విస్మరించిందని మంత్రి చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. గవర్నర్ ప్రసంలో ఒకలా మంత్రి ప్రసంగం మరోలా కొనసాగడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కోణం స్పష్టం అవుతోందనే టాక్ వినిపిస్తోంది. పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదింపజేసుకోవడం కోసమే గవర్నర్ ప్రసంగంలో కేంద్రానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడిందనే చర్చ జరుగుతోంది.