రైతు వ్యతిరేక బడ్జెట్.. Harish Rao Thanneeru
కేంద్రం ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు వ్యతిరేక బడ్జెట్ అని రాష్ట్రమంత్రి హరీశ్ రావు విమర్శించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్. అందమైన మాటలు తప్ప.. నిధుల కేటాయింపులో డొల్లనే ఉన్నది. 7 ప్రాధాన్యత రంగాలన్నారు. అసలు ఉన్న రంగాలను గాలికి వదిలివేశారు. దేశ రైతాంగాన్ని, అభివద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచే బడ్జెట్. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి తీవ్ర అన్యాయం చేసిన బడ్జెట్ ఇది. తొమ్మిదేళ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాటలేదు.. గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన నిధులు తూతూమంత్రమే. విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదు. జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలేదు. రాష్ట్రంలోని నేతన్నలకు సంబంధించి జీఎస్టీ రాయితీలు కానీ, వారికి ప్రత్యేక ప్రోత్సాహాలు ఇవ్వడం కానీ చేయలేదు. కొత్త రాష్ట్రానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని అనేకసార్లు కోరాం.. కానీ, ఇప్పటి వరకు ఇచ్చిందేమీ లేదు.. ఈ బడ్జెట్‌లో కూడా ఇస్తామన్నది ఏమీ లేదు.
పారిశ్రామిక వాడలకు సంబంధించి తెలంగాణకు ఒక్కటంటె ఒక్కటి కూడా కొత్తగా ఇస్తామన్నది లేదు. బడ్జెట్‌లో రైతులకు సంబంధించిన నిధుల్లో భారీగా కోత పెట్టారు. ఎరువుల సబ్సిడీలు తగ్గించారు, గ్రామీణ ఉపాధి హామి నిధుల్లో కోత పెట్టారు, ఆహార సబ్సిడీలు తగ్గించారు. కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేస్తామని చెప్పలేదు. ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు కూడా ఆశాజనకంగా ఏమీ లేదు. ఉద్యోగులను సైతం భ్రమల్లో పెట్టారు. ఇక సెస్సుల భారం తగ్గించలేదు.. పన్నుల భారం నుంచి ఉపశమనం లేదు. ఇదో భ్రమల బడ్జెట్. పేదల వ్యతిరేక బడ్జెట్. తెలంగాణకు మొండి చేయి చూపిన బడ్జెట్.