బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏమైంది?: Harish Rao
దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు మంజూరు చేయలేదో కేంద్రం సమాధానం చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు మంజూరు చేయలేదో కేంద్రం సమాధానం చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే మరింత న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని కోరినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహా ప్రవేశాల సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఉచితాల పేరుతో కల్యాణ లక్ష్మీ, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్ వద్దని స్వయంగా దేశ ప్రధాని చెబుతున్నాడని వీటిని అడ్డుకుంటే ప్రజలు ఏమవ్వాలని నిలదీశారు. ఉచితాలు వద్దంటున్న మోడీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు పారిశ్రామిక వేత్తలకు మాఫీ చేసిందని అన్నారు. ఓ వైపు బడా కార్పొరేట్లకు రుణాలు మాఫీ చేస్తూ.. మరోవైపు ఉచితాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజానీకానికి అందిస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని చూడడం సరికాదని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి స్కీమ్స్ ఉన్నాయా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని సీఎం కేసీఆర్ రెట్టింపు చేస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రజల సొమ్మును ధనవంతులకు పంచిపెడుతోందని ఆరోపించారు.
త్వరలో సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం:
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంటి నిర్మాణం కోసం ఇచ్చే డబ్బులు బేస్మెంట్‌కు కూడా సరిపోయేవి కాదని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పైసా ఖర్చు లేకుండా ఇళ్లు కట్టించి నేరుగా తాళం చేతిని లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. త్వరలోనే సొంత స్థలంలో ఇంటిని నిర్మించుకునే వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ వచ్చాక ఆసరా పెన్షన్లు, నిరంతర ఉచిత కరెంటు, ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేసుకుంటున్నామని అన్నారు. త్వరలో అర్హులైన అందరికీ కొత్త పెన్షన్లు అందజేస్తామన్నారు.
రైతులకు కరెంట్ ఇస్తే బీజేపీకి కళ్ల మంట:
తెలంగాణలో కోతలు లేకుండా నాణ్యమైన కరెంటు రైతులకు అందిస్తుంటే బీజేపీకి కళ్ళు మండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు కరెంట్ రాకుండా బీజేపీ అడ్డుపడుతోందని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత రావాల్సిన కరెంటు కేంద్రం కట్ చేసిందన్నారు. బాయికాడ మీటరు పెట్టలేదని రాష్ట్రానికి రావాల్సిన రూ.6500 కోట్లు ఇవ్వలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏ వర్గం బాగుపడ్డదో, ఎవరికి లాభం చేకూరిందో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దొంగ రాత్రి కరెంటు వచ్చేదని, రైతులు ఎంత తిప్పలు పడ్డారో మర్చిపోలేమని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలను కడుపున పెట్టుకుని చూసుకుంటోందని అన్నారు.