'కేసీఆర్ సభతో బీజేపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది'
చండూరులో సీఎం కేసీఆర్ సభతో బీజేపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా అయిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీజేపీ నాయకులు గల్లీ నేతల కంటే దిగజారి మాట్లాడుతున్నారని,
దిశ, డైనమిక్ బ్యూరో: చండూరులో సీఎం కేసీఆర్ సభతో బీజేపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా అయిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీజేపీ నాయకులు గల్లీ నేతల కంటే దిగజారి మాట్లాడుతున్నారని, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌వి నకిలీ మాటలు, వెకిలి చేష్టలని విమర్శించారు. మాయమాటలతో అంతులేని అబద్దాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు బీజేపీ నేతలు తమ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని అన్నారు. కిషన్ రెడ్డి, సంజయ్ స్థాయి ఏంటో ఢిల్లీ దూతలే చెప్పారని అన్నారు. బీజేపీ నేతలు మాట్లాడే మాటల్లో ఒక్క మాట కూడా నిజం లేదని, ఎనిమిదేళ్లలో చేయలేని వారు 15 రోజుల్లో చేస్తారా అని కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారని కానీ ఈ ఎనిమిదేళ్లలో ఏం చేశామో మునుగోడు వస్తే చూపిస్తామని కౌంటర్ ఇచ్చారు. 99 శాతం ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న లబ్ధి ఫలాలు అందుతున్నాయని అన్నారు. ఈ మాటలు మునుగోడు ప్రజలే చెబుతున్నారని అన్నారు.
రైతు బంధు, రైతు బీమా, ఆసరా, పింఛన్, కేసీఆర్ కిట్, రైతులకు ఉచిత విద్యుత్, రైతు బీమా ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించిన విషయం కళ్ల ముందే కనుబడుతోందన్నారు. బీజేపీ నేతలు ఢిల్లీలో కూర్చొని మాట్లాడటం కాదని మునుగోడులో వచ్చి ఓటర్లను అడిగి తెలుసుకోవాలన్నారు. బీజేపీ ద్వారా ఏదైనా లబ్ధి జరిగింది అంటే సిలిండర్, ఇంధన ధరలు పెంచడమేనన్నారు. టీఆర్ఎస్ విధానం ప్రజలకు సంక్షేమ ఫలాలు పంచడం అయితే బీజేపీది ధరలు పెంచడమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అత్యధిక రైతు బంధు పొందిన నియోజకవర్గం మునుగోడు అని చెప్పారు. పార్టీలో చేరకలపై బీజేపీ నేతలు మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వళ్లించడమేనని, ఈడీలు, డబ్బును ఆశ చూపి ప్రలోభాలకు గురి చేసి ప్రభుత్వాలను కూల్చివేసిన చరిత్ర బీజేపీది అన్నారు. టీఆర్ఎస్ లో చేరిన వారంతా రాజ్యాంగ పరిమితులకు లోబడి టీఆర్ఎస్ లో విలీనం అయ్యారే తప్పా బీజేపీ మాదిరిగా దొడ్డి దారిలో చేర్చుకోలేదని అన్నారు.
తాజాగా తమ ఎమ్మెల్యేలకు రూ.100 కోట్ల ఆశ చూపినా ఎమ్మెల్యేలు ఆ డబ్బును గడ్డి పోచలా చూశారని అన్నారు. పార్లమెంట్ లో టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో విలీనం చేసుకోలేదా కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. మీరు చేసింది కరెక్ట్ అయితే మా పార్టీలో విలీనం అయితే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మీద ఆ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను దొడ్డిదారిలో కూల్చివేసి గద్దెనెక్కిన మీరు ఎమ్మెల్యేల కొనుగోలు గురించి మాట్లాడుతారా? అని నిలదీశారు. మోటర్లకు మీటర్ల విషయంలో కిషన్ రెడ్డి సొంత ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా ఉందని, ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ పంపిన లేఖను హరీశ్ రావు ఈ సందర్భంగా చూపించారు.
ఇవి కూడా చదవండి: పాట ఒకరిది.. పేరు సీఎం సాబ్‌ది..!