TS: ప్రతి గింజను కొనుగోలు చేస్తాం.. మంత్రి గంగుల హామీ

రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ధాన్యం కొనుగోలు కోసం అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

Update: 2023-04-16 15:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ధాన్యం కొనుగోలు కోసం అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏడాదిలో వానాకాలం, యాసంగి సీజన్లలో కనీస మద్దతు ధరకు రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఆదివారం కరీంనగర్‌ రూరల్‌ మండలం చర్లబూత్కూరు, ముగ్దంపూర్‌ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యాసంగి పంట ముందుగానే కోతకు వస్తుందని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 15 రోజులు ముందుగానే ధాన్యం కొనుగోలు ప్రారంభించామన్నారు.

తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 7100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ధాన్యం దిగుబడికి అనుగుణంగా కేంద్రాలను ప్రారంభిస్తున్నామని శనివారం నాటికి 420 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నాలుగు కోట్ల 15 లక్షల విలువ చేసే 2000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని, కేంద్రాల సంఖ్యను పెంచుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఒక్కో గ్రామంలో రెండు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ అందుబాటులో ఉందన్నారు. ధాన్యంలో తేమ 17 శాతం మించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతుల ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులను సకాలంలో వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి మోసపోకుండా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రలు ప్రారంభిస్తున్నామని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌, జిల్లా కలెక్టర్‌ ఆర్‌‌వి కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ జీవి శ్యాం ప్రసాద్‌ లాల్‌, శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News