ఎన్నికల వేళ ఆసక్తిగా మారిన KCR మిత్రుడి వ్యూహం.. ఆయన ప్లాన్‌తో చెక్ పడేదెవరికి..?

జాతీయ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. రాబోయే 2024 ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి.

Update: 2023-03-06 07:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. రాబోయే 2024 ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్‌కు మిత్ర పార్టీగా ఉన్న ఎంఐఎం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే కర్ణాటక అసెంబ్లీలో పోటీకి సిద్ధం అవుతోంది. ఇక్కడ కనీసం 20 స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉండగా తాజాగా పోటీకి ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేస్తూ తొలి జాబితా విడుదల చేసింది.

ఈ పరిణామం ఇటు బీజేపీతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లోనూ ఆసక్తిగా మారింది. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున అభ్యర్థులను నిలిపి తమ బలమేంటో చాటుకునేందుకు గులాబీ బాస్ వ్యూహరచన చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు. ఇంతలో ఎంఐఎం ఏకంగా 20 స్థానాలపై గురి పెట్టడం హాట్ టాపిక్ అవుతోంది.

ఇక్కడ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ తమ కార్యాచరణను వేగవంతం చేసింది. పార్టీ అగ్రనేతల వరుస టూర్లతో కర్ణాటక రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా వంటి కీలక నేతలు కర్ణాటకను చుట్టి వచ్చేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నేతలు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరో ప్రధాన పార్టీ జేడీఎస్ పార్టీలో ఇంటిపోరు సమస్యగా మారింది.

ఇక ఆమ్ ఆద్మీ అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం అని ఆ పార్టీ నేతలు క్లారిటీ ఇవ్వగా ఇస్తుండగా బీఆర్ఎస్ పోటీ చేయబోయే స్థానాలు ఎన్ని అనేది సస్పెన్స్‌గా మారింది. ఇక్కడ బీజేపీ, మజ్లిస్ విషయంలో టిప్పు సుల్తాన్ అంశం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ క్రమంలో కేసీఆర్‌కు మిత్రుడిగా ఉన్న అసదుద్దీన్ ఒవైసీ తీసుకున్న నిర్ణయం కర్ణాటక రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్‌గా మారింది. మజ్లిస్ 20 స్థానాల్లో బరిలోకి నిలిస్తే రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఒవైసీ నిర్ణయం బీఆర్ఎస్‌కు అవకాశాలకు గండి కొడుతుందా లేక కలిసి వచ్చేలా చేస్తుందా అనేది హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News